బాబర్‌ ఆజమ్‌ను కాపాడిన టీమిండియా మేనేజ్‌మెంట్‌

27 Sep, 2023 17:07 IST|Sakshi

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ టాప్‌ ర్యాంక్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్‌ పరోక్షంగా కాపాడింది. రెండో ర్యాంక్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను ఆసీస్‌తో మూడో వవ్డేలో ఆడకుండా రెస్ట్‌ ఇచ్చిన భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం బాబర్‌ టాప్‌ ర్యాంక్‌ కోల్పోకుండా తోడ్పడింది. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో (74, 104) పరుగుల వరద పారించడంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ టాప్‌ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు.

గిల్‌ ప్రస్తుత రేటింగ్‌ పాయింట్లకు బాబర్‌ రేటింగ్‌ పాయింట్లకు మధ్య తేడా కేవలం 10 పాయింట్లు మాత్రమే. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ 857 పాయింట్లు కలిగి ఉంటే.. గిల్‌ తాజా ప్రదర్శనలతో మరిన్ని పాయింట్లు సాధించి తన కెరీర్‌ బెస్ట్‌ అయిన 847 పాయింట్లు సాధించాడు. ఒకవేళ ఆసీస్‌తో మూడో వన్డేలో గిల్‌ ఆడి ఉంటే, కనీస పరుగులు చేసినా నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌ అయ్యుండేవాడు.

ప్రపంచ నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌ హోదాలో అతను వరల్డ్‌కప్‌ ఎంట్రీ ఇచ్చేవాడు. అయితే టీమిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కారణంగా  ఇది కార్యరూపం దాల్చలేదు. బాబర్‌ టాప్‌ వన్డే ర్యాంకర్‌గానే వరల్డ్‌కప్‌ బరిలో నిలుస్తాడు. అయితే ఈ ముచ్చట బాబర్‌కు ఎన్నో రోజులు నిలబడేలా లేదు. గిల్‌.. వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసినా వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌గా అవతరిస్తాడు. 

ఇదిలా ఉంటే, తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. టాప్‌ 12 ర్యాంక్‌లు యాధాతథంగా కొనసాగుతున్నాయి. భారత్‌ నుంచి గిల్‌, కోహ్లి (9వ ర్యాంక్‌) టాప్‌ 10లో ఉండగా.. రోహిత​ శర్మ 11వ స్థానంలో నిలిచాడు. 

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే ఈ విభాగంలో టీమిండియా ఏస్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఆసియా కప్‌ 2023 ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న సిరాజ్‌... ఆ తర్వాత ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేలు ఆడనప్పటికీ వన్డే టాప్‌ ర్యాంక్‌ను కోల్పోలేదు. ఈ విభాగంలో సిరాజ్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌ టాప్‌ 10లో (10వ ర్యాంక్‌) ఉన్నాడు. ఇక్కడ కూడా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు.

మరిన్ని వార్తలు