WC 2023: చార్మినార్‌ ముంగిట వన్డే వరల్డ్‌కప్‌..

21 Sep, 2023 16:22 IST|Sakshi
చార్మినార్‌ ముంగిట వరల్డ్‌కప్‌ ట్రోఫీ (PC: Social Media)

ICC ODI World Cup 2023: ప్రపంచకప్‌ ట్రోఫీ గెలవడం ప్రతీ క్రికెటర్‌ కల.. కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులు, అరుదైన ఘనతలు సాధించినా.. కనీసం ఒక్క వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ఆటగాళ్లు.. ఆ కప్పును అందుకోగానే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్‌.. 

మరి అభిమానులకు నేరుగా మ్యాచ్‌లు వీక్షించడం కంటే సంతోషం మరొకటి ఉండదు.. ముఖ్యంగా ఫైనల్లో ట్రోఫీ ప్రదానోత్సవం ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే అనడంలో సందేహం లేదు.. ఆటగాళ్ల భావోద్వేగాలకు ఒక్కోసారి వీరాభిమానుల కళ్లు కూడా చెమర్చుతాయి..

భాగ్యనగరానికి వచ్చేసిన ట్రోఫీ
ఆ కప్పును తామే అందుకున్నంత సంబరం కూడా! మరి ఆ ట్రోఫీని కళ్లారా.. అది కూడా అతి దగ్గరగా చూసే అవకాశం వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదా! హైదరాబాద్‌ వాసులకు ఇప్పుడు ఆ ఛాన్స్‌ వచ్చింది.. అంతరిక్షం మొదలు.. ప్రపంచ దేశాలను చుట్టి వస్తున్న వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది.

చార్మినార్‌ ముంగిట వన్డే వరల్డ్‌కప్‌
వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్‌ ముందు గురువారం ఈ ట్రోఫీని ప్రదర్శించారు. దీంతో ఎప్పుడోగానీ లభించే ఈ సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు సందర్శకులు అక్కడికి చేరుకోకుండా ఉంటారా?! కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

ట్రోఫీ టూర్‌ ఇక్కడే మొదలై.. ఇప్పుడిలా..
జూన్‌ 27న ఇండియాలో వరల్డ్‌కప్‌ ట్రోఫీ టూర్‌ ఆరంభం కాగా.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండియా, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, మలేషియా, ఉగాండా, నైజీరియా, సౌతాఫ్రికా.. మళ్లీ ఇప్పుడు.. సెప్టెంబరు 4న ఇండియాకు చేరుకుంది.

తాజాగా హైదరాబాద్‌కు వచ్చేసింది. చార్మినార్‌తో పాటు ఉప్పల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోనూ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచనున్నారు. వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా అక్టోబరులో ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక.. అంతకు ముందు తాజ్‌మహల్‌ ముంగిట కూడా ట్రోఫీని ప్రదర్శించిన విషయం తెలిసిందే. 

చదవండి: టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు

మరిన్ని వార్తలు