ICC: ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ విజేతలు వీరే!

11 Apr, 2022 14:24 IST|Sakshi

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. మహిళా క్రికెట్‌ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ రాచెల్‌ హేన్స్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. 

కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కరాచీ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్‌ ఆజమ్‌ రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్‌ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఉస్మాన్‌ ఖవాజా(ఆసీస్‌ బ్యాటర్‌), అబ్దుల్లా షఫీక్‌ తర్వాతి స్థానంలో (టాప్‌-3 రన్‌ స్కోరర్‌) నిలిచాడు. 

ఈ సిరీస్‌లో మొత్తంగా ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్‌ కమిన్స్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు.

రాచెల్‌ అద్బుతం!
ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్‌ రాచెల్‌ హేన్స్‌ పాత్ర కీలకం. మార్చి నెలలో ఆమె సాధంచిన మొత్తం పరుగుల సంఖ్య 429 పరుగులు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రాచెల్‌ చేసిన క్లాసీ సెంచరీ(130 పరుగులు) అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది.

ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మార్చి నెలకు గానూ ఆసీస్‌ స్టార్‌ అలిస్సా హేలీని, ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లిస్టోన్‌, దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లారా వొల్వార్డ్‌లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్నారు. నిలకడైన ఆట తీరుతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికయ్యారు.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు