ICC POTM- May: ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ విజేతలు వీరే! తొలి ఆటగాడిగా మాథ్యూస్‌!

13 Jun, 2022 14:48 IST|Sakshi
విజేతలు ఏంజెల్‌ మాథ్యూస్‌, తుబా హసన్‌(PC: ICC)

ICC Players of the Mont​h- May: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులను సోమవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్‌ విభాగంలో మే నెలకుగానూ శ్రీలంక బ్యాటర్‌ ఏంజెలో మాథ్యూస్‌.. మహిళల విభాగంలో పాకిస్తాన్‌ స్పిన్‌ సంచలనం తుబా హసన్‌ ఈ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీ మీడియా ప్రకటన విడుదల చేసింది.

తొలి ఆటగాడిగా
కాగా ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్‌ అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక.. బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా చట్టోగ్రామ్‌, మీర్పూర్‌ టెస్టుల్లో కలిపి అతడు 344(వరుసగా 199, 145) పరుగులు సాధించాడు. తద్వారా లంక సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసి మాథ్యూస్‌.. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, సిబ్బంది.. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదని, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు.

అరంగేట్రంలోనే అదరగొట్టి..
ఇక తుబా విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ లెగ్‌ స్పిన్నర్‌ శ్రీలంకతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టిన ఆమె.. పాక్‌ ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలుచుకుంది.

ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన తుబాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.‍
చదవండి: Ind Vs SA 3rd T20: వైజాగ్‌లో గ్రౌండ్‌ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే!
Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో!

మరిన్ని వార్తలు