ICC T20 WC 2022: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

25 Aug, 2022 19:43 IST|Sakshi

టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ. చిరకాల ప్రత్యర్థులు ఎదురైన ప్రతీ మ్యాచ్‌ మంచి రసవత్తరంగా సాగుతుంది. కొన్నిసార్లు ఏకపక్షంగా సాగినప్పటికి.. ఎక్కువసార్లు నువ్వా-నేనా అన్నట్లుగానే తలపడ్డాయి. అందుకే పాక్‌-భారత్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోవడం సాధారణం.

ఒకవేళ ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీలైతే చెప్పేదేముంది. గతేడాది టి20 ప్రపం‍చకప్‌ యూఏఈ వేదికగా జరిగింది. ఈ టోర్నీలో భారత్‌-పాకిస్తాన్‌ తలపడిన మ్యాచ్‌కు వ్యూయర్‌షిప్‌ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో పాటు మ్యాచ్‌ జరిగిన దుబాయ్‌ స్టేడియానికి ప్రేక్షకులు కూడా పోటెత్తారు. తాజాగా ఆసియా కప్‌లో ఆగస్టు 28న జరగనున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. 

ఆసియా కప్‌ ముగిసిన రెండు నెలల్లోనే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2022 టి20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌లు మరోసారి తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలో టికెట్లు విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తాజాగా ఐసీసీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూడాలనుకునే అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మరో నాలుగు వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఒక్కో టికెట్‌ ధర 30 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా (మన కరెన్సీలో దాదాపు రూ.1670) పేర్కొంది. అయితే ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్దతిలో కేటాయిస్తామని ఐసీసీ వెల్లడించింది.

''భారత్‌, పాక్‌ మ్యాచ్‌ చూసేందుకు మరింత మంది అభిమానులకు అవకాశం కల్పించడానికి నాలుగు వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను కేటాయించాం. అక్టోబర్‌ 23న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థుల మధ్‌య పోరు జరగనుంది. టీమిండియా-పాక్‌ మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. వీటితో పాటు ఐసీసీ హాస్పిటాలిటీ, ఐసీసీ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ ప్రోగ్రామ్స్‌ తరపున పరిమిత సంఖ్యలో ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చాం. నవంబర్‌ 13న జరిగే మెగా టోర్నీ ఫూనల్‌ మ్యాచ్‌ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.'' అని ఐసీసీ ప్రతినిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు