Olympics: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అన్నీ అనుకున్నట్లు జరిగితే

11 Aug, 2021 08:56 IST|Sakshi

దుబాయ్‌: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను కూడా చూడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఒలింపిక్స్‌లో జెంటిల్‌మెన్‌ గేమ్‌ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్‌ దాఖలు చేయనుంది. ఇందుకోసం ఐసీసీ ఒలింపిక్‌ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ‘విశ్వవ్యాప్తమైన మా క్రికెట్‌ను ఒలింపిక్‌ విశ్వక్రీడల్లోనూ చూడాలనుకుంటున్నాం. క్రికెట్‌ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ఇందులో 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్నారు’ అని ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే ఒక తెలిపారు. 

బర్మింగ్‌హాంలో జరిగే 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చారు. కాగా ఈ క్రీడల్లో క్రికెట్‌ 1998లో ఒకసారి ఆడించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ ఇయాన్‌ వాట్‌మోర్‌ నేతృత్వంలో ఐసీసీ ఒలింపిక్‌ వర్కింగ్‌ గ్రూప్‌ పనిచేస్తుంది. ఇందులో ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్‌ ఇంద్రనూయి, తవెంగ్వా ముకులని (జింబాబ్వే), మహీంద్ర వల్లిపురం (ఆసియా క్రికెట్‌ మం డలి), పరాగ్‌ మరాఠే (అమెరికా) సభ్యులుగా ఉన్నారు. నిజానికి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేర్చేందుకు బీసీసీఐ ఇన్నాళ్లు ససేమిరా అనడంతో అడుగు ముందుకు పడలేదు. ఒలింపిక్‌ సంఘం గొడుకు కిందికి వస్తే తమ స్వయం ప్రతిపత్తికి ఎక్కడ ఎసరు వస్తుందని బీసీసీఐ భావించింది. కానీ  ఇటీవల బీసీసీఐ కార్య దర్శి జై షా సుముఖత వ్యక్తం చేయడంతో ఐసీసీ చకచకా పావులు కదుపుతోంది.

చదవండి: టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన కివీస్‌.. ఇద్దరు సీనియర్లు ఔట్‌

మరిన్ని వార్తలు