WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్‌లో

8 Jun, 2021 12:54 IST|Sakshi

లండన్‌: మరో పది రోజుల్లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరగనుంది. తొలిసారి టెస్టు క్రికెట్‌లో చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరగనుండడంతో క్రికెట్‌ ప్రేమికుల దృష్టి దీనిపైనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఐసీసీ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోజుకో విషయంతో మన ముందుకు వస్తుంది. తాజాగా మంగళవారం ఐసీసీ తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫోటో ఆసక్తికరంగా మారింది. 

2008 అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌లు సెమీ ఫైనల్లో తలపడ్డాయి. అప్పటి టీమిండియా జట్టులో కోహ్లి, రవీంద్ర జడేజా.. కివీస్‌ జట్టులో కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ సభ్యులుగా ఉన్నారు. విచిత్రమేంటంటే.. అప్పటి జట్టుకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి, కివీస్‌ కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌లు ఉండడం విశేషం. తాజాగా జరగనున్న టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇరు జట్లు కెప్టెన్లుగా ఈ ఇద్దరే ఉన్నారు. వీరిద్దరితో పాటు టీమిండియా నుంచి జడేజా ప్రస్తుత జట్టులో ఉండగా.. కివీస్‌ నుంచి టిమ్‌ సౌథీతో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌  ఉన్నారు.  అలా 13 ఏళ్ల కింద ఒక మెగా సెమీఫైనల్‌ ఆడిన ఈ నలుగురు మరోసారి టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సిద్ధమవుతున్నారు. ఐసీసీ పెట్టిన ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఇక 2008 అండర్‌- 19 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోరె అండర్సన్‌ 70 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కేన్‌ విలియమ్సన్‌ 37 పరుగులు చేశాడు. అనంతరం టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 43 ఓవర్లలో 191 పరుగుల చేయాల్సి వచ్చింది. టీమిండియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి ఫైనల్లో అడుగుపెట్టింది. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇక ఫైనల్లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా   దక్షిణాఫ్రికాను ఓడించి సగర్వంగా అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 
చదవండి: ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్‌పే

WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు

మరిన్ని వార్తలు