ఇలా బౌల్ చేశామనుకుంటారు.. కానీ

16 Nov, 2020 09:42 IST|Sakshi
బౌలింగ్‌ చేస్తున్న కివీస్‌‌ కెప్టెన్‌, సన్‌రైజర్స్‌ ఆటగాడు విలియమ్సన్‌(కర్టెసీ: బీసీసీఐ)

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన మీమ్‌ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ బౌలింగ్‌ విధానం గురించి చేసిన చేసిన కంపేరెటివ్‌ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బ్యాట్స్‌మెన్‌ ఎలా బౌల్‌ చేయాలనుకుంటారు, వాస్తవానికి వాళ్ల బౌలింగ్‌ ఎలా ఉంటుంది అన్న పోలికతో ఈఫిల్‌ టవర్‌ను, ఎలక్ట్రిసిటి ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అయితే కొంతమంది మాత్రం.. ‘‘ఐసీసీ ఇలా పనిచేయాలనుకుంటుంది, కానీ దాని పనితీరు ఇలా ఉంటుంది’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ వేళ ఐసీసీ పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్‌ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్‌ చేసిన ఐసీసీ.. ‘హెయిర్‌ అప్రిసియేషన్‌ డే’ అంటూ కామెంట్‌ను జతచేసింది. ఇలాంటి మరెన్నో హిలేరియస్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతూనే తమ అప్‌డేట్స్‌ను పంచుకుంది. (చదవండి: ఆ టోర్నీ షెడ్యూల్‌లో మార్పులేదు: ఐసీసీ)

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాశలో మునిగిపోయిన క్రికెట్‌ ప్రేమికులకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే జింబాబ్వే పాకిస్తాన్‌లో పర్యటిస్తుండగా, త్వరలోనే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్‌ మొదలుకానుండటంతో రసవత్తర పోటీని వీక్షించేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. నవంబరు నుంచి జనవరి వరకు సాగే సుదీర్ఘ పర్యటన కోసం ఇ‍ప్పటికే అక్కడికి చేరుకున్న జట్టు మ్యాచ్‌ సన్నాహకాల్లో మునిగిపోయింది. 3 వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా క్రికెట్‌కు ఆటంకం కలిగినా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జూన్‌లోనే దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు వరుస మ్యాచ్‌లు వీక్షించే అవకాశం లభించింది.(చదవండి: ఐపీఎల్ 2020‌: యూఏఈకి బీసీసీఐ బంపర్‌ బొనాంజ!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు