Serbina Cricketer : వికెట్‌ తీసిన ఆనందం.. ఎవరు ఊహించని సెలబ్రేషన్‌

22 Jul, 2022 16:40 IST|Sakshi

క్రికెట్‌లో ఒక్కో ఆటగాడికి యూనిక్‌ సెలబ్రేషన్స్‌ ఉండడం సహజం. బౌలర్‌ వికెట్‌ తీసినప్పుడో.. బ్యాటర్‌ సెంచరీ కొట్టినప్పుడో వింత ఎక్స్‌ప్రెషన్స్‌ సహా తమ చర్యలతో ఆకట్టుకుంటారు. తాజాగా సెర్బియాకు చెందిన అయో మేనే-ఎజెగి అనే క్రికెటర్‌ కూడా వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఐసీసీ మెన్స్‌ టి20 వరల్డ్‌కప్‌ సబ్‌ రీజియన్‌ క్వాలిఫయర్స్‌ గ్రూఫ్‌-ఏలో సెర్బియా, ఐల్‌ ఆఫ్‌ మ్యాన్ తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో అయో మేనే-ఎజెగి నాలుగు వికెట్లతో మెరిశాడు. ఒక వికెట్‌ తీసిన సందర్భంలో గ్రౌండ్‌పై రెండుసార్లు ఫ్లిప్‌(గెంతులు) చేసి ఆ తర్వాత నేలపై తన చేతులను చాచి పడుకున్నాడు. ఈ వింత సెలబ్రేషన్‌ అక్కడున్న వారి చేత నవ్వులు పూయించింది. ఈ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్‌ చేసిన ఐసీసీ.. ''వందో వికెట్‌ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్‌ చేసుకున్న సెర్బియా క్రికెటర్‌ అయో మేనే-ఎగిజి'' అని క్యాప్షన్‌ జత చేసింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోకు దాదాపు 1,85,000 లైక్స్‌ రావడం విశేషం.

ఇక మ్యాచ్‌లో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ 68 పరుగుల తేడాతో సెర్బియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సెర్బియా పూర్తి ఓవర్లు ఆడినప్పటికి ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇప్పటికే ఆతిథ్య హోదాలో ఆస్ట్రేలియా సహా భారత్‌, న్యూజిలాండ్‌ లాంటి టాప్‌-8 దేశాలు అర్హత సాధించాయి. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో టి20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 స్టేజీ ప్రారంభం కానుంది.

A post shared by ICC (@icc)

చదవండి: ఇంగ్లండ్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి

పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా?

మరిన్ని వార్తలు