ODI Cricket: 'వన్డే క్రికెట్‌కు ముప్పు లేదు'.. కుండ బద్దలు కొట్టిన ఐసీసీ

28 Jul, 2022 11:03 IST|Sakshi

వన్డే క్రికెట్‌కు ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న ఊహాగానాలకు ఐసీసీ తెర దించింది. వన్డే క్రికెట్‌పై గురువారం స్పందిస్తూ.. ''దుష్ప్రచారం వద్దు.. పరిమిత ఓవర్ల ఆటకు ఎలాంటి ముప్పు లేదు'' అంటూ ఐసీసీ కుండ బద్దలు కొట్టింది.  ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. ''2023-27 వరకు ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ)లో భాగంగా ఇప్పటికే షెడ్యూల్‌ ఫైనలైజ్‌ అయింది. ఈ ప్రోగ్రామ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఆయా జట్లు వన్డేలు మాత్రమే ఆడవు.

వన్డేలతో పాటు టెస్టులు, టి20లు ఇలా సమానంగా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు. అయితే వన్డేలు ఆడే సంఖ్య విషయంలో తగ్గించాలా లేదా అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్‌టీపీ ప్రకారం క్యాలండర్‌ను రూపొందించాం. ఇప్పటికైతే వన్డేల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇక వన్డేలకు ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. టెస్టు, టి20ల్లాగే వన్డే క్రికెట్‌ కూడా బతికే ఉంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు కారణం కొంతమంది  దేశవాళీ టోర్నమెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే. అయితే దీనివల్ల అంతర్జాతీయ, ద్వైపాక్షిక క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటిపై ఉన్న నిబద్ధత ఎప్పటిలాగే బలంగా ఉందని స్పష్టం చేశారు.

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు గుడ్‌బై చెప్పిన అనంతరం వన్డే క్రికెట్‌పై విభిన్న వాదనలు వచ్చాయి. బిజీ షెడ్యూల్‌ కారణంగా విశ్రాంతి దొరకడం లేదని.. దీనివల్ల ఆటగాళ్లు మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారని స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ) పేరిట ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా ఆడించడం వలన తరచూ గాయాలపాలవ్వడం లేదా ఫిట్‌నెస్‌ కోల్పోవడమో జరుగుతుందని తెలిపాడు. పరిగెత్తడానికి మేం కార్లు కాదని.. మనుషులమే అని.. అందుకే వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు స్టోక్స్‌ వివరించాడు.

కాగా స్టోక్స్‌కు చాలా మంది క్రికెటర్లు మద్దతు తెలిపారు. ఇంగ్లండ్‌ ప్రస్తుత కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ కూడా స్టోక్స్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వన్డే క్రికెట్‌ వల్ల నష్టం ఎక్కువ ఉందని అభిప్రాయపడ్డాడు. మరికొంత మంది మాజీ క్రికెటర్లు ఒక అడుగు ముందుకేసి వన్డేలను రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడితే.. రవిశాస్త్రి లాంటి మాజీలు వన్డేలను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి ఆడితే బాగుంటుందని పేర్కొన్నారు. తాజాగా ఐసీసీ వన్డే క్రికెట్‌లో ఎలాంటి మార్పులు లేవని.. యధాతథంగా కొనసాగుతుందని వెల్లడించడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌పై వస్తున్న అనుమానాలకు బ్రేక్‌ పడినట్లయింది.

చదవండి: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?

Shubman Gill: మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్‌చేస్తే

మరిన్ని వార్తలు