ICC T20 Rankings: పాక్‌ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్‌ ఓపెనర్‌

7 Sep, 2022 16:40 IST|Sakshi

ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ దుమ్మురేపాడు. ఆసియాకప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లాడిన రిజ్వాన్‌ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్‌ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్‌ ఉండగా.. నిన్నటివరకు టాప్‌ ప్లేస్‌లో ఉన్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్‌ మార్క్రమ్‌ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ ఉన్నాడు. ఇక ఆసియాకప్‌లో భాగంగా సూపర్‌-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు.

ఇదే మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో జోష్‌ హాజిల్‌వుడ్‌ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్‌ షంసీ రెండు, ఆదిల్‌ రషీద్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్‌ అల్‌ హసన్‌ రెండు.. 221 పాయింట్లతో మొయిన్‌ అలీ మూడో స్థానంలో ఉన్నాడు.

చదవండి: ఆసియా కప్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం

Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై!

మరిన్ని వార్తలు