ICC T20 Rankings: శ్రేయాస్‌ అయ్యర్‌ జోరు.. టాప్‌-10 నుంచి కోహ్లి ఔట్‌

2 Mar, 2022 16:27 IST|Sakshi

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ జోరు చూపెట్టాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన టి20 సిరీస్‌లో శ్రేయాస్‌ మూడు మ్యాచ్‌లు కలిపి మూడు అర్థ సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన అయ్యర్‌.. తాజాగా టి20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు.

లంకతో సిరీస్‌కు ముందు టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ విభాగంలో 45వ స్థానంలో ఉన్న అయ్యర్‌ ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానంలో నిలిచాడు. ఇక లంకతో టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లి టాప్‌ 10లో స్థానం కోల్పోయాడు. 612 పాయింట్లతో ఐదు స్థానాలు దిగజారిన కోహ్లి 15వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా నుంచి కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం. 646 పాయింట్లతో రాహుల్‌ 10వ స్థానంలో నిలిచాడు.

చదవండి: Mohammed Siraj: ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి: సిరాజ్‌

ఇక పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 805 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌) 798 పాయింట్లతో రెండు, ఎయిడెన్‌ మార్క్రమ్‌(సౌతాఫ్రికా) 796 పాయింట్లో మూడో స్థానంలో ఉ‍న్నాడు. డేవిడ్‌ మలాన్‌( ఇంగ్లండ్‌, 728 పాయింట్లు), డెవన్‌ కాన్వే(న్యూజిలాండ్‌, 703 పాయింట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియాతో రెండో టి20లో 75 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిసిన లంక బ్యాట్స్‌మన్‌ పాతుమ్‌ నిస్సాంక ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

బౌలింగ్‌ విభాగంలో టాప్‌టెన్‌లో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక లంకతో సిరీస్‌లో బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన భువనేశ్వర్‌ మూడు స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన తబ్రెయిస్‌ షంసీ(784 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందని జోష్‌ హాజిల్‌వుడ్‌ 752 పాయింట్లతో రెండు, ఆదిల్‌ రషీద్‌( ఇంగ్లండ్‌, 746 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.

చదవండి: Sunil Narine: భీకర ఫామ్‌లో కేకేఆర్‌ ప్లేయర్‌..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం

 లంకతో మూడో టి20: శ్రేయాస్‌ అయ్యర్‌ (73*) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ వీడియో

మరిన్ని వార్తలు