క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్‌ లైవ్ మ్యాచ్‌లు

15 Oct, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్‌లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 7వ ఎడిషన్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది. 

ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ నవంబరు 14న  జరగనుంది. మార్క్యూ లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్‌ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. (చదవండి: AICF: చెస్‌కు ‘ఎంపీఎల్‌’ అండ.. కోటితో మొదలుపెట్టి..)

క్రికెట్‌ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్‌కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్‌లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్‌లో భారీ మెగాప్లెక్స్ ప్రారంభించింది.

పీవీఆర్ సినిమాస్
ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు  ఉన్నాయి.(చదవండి: బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!)

మరిన్ని వార్తలు