బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్‌!

2 Nov, 2022 03:44 IST|Sakshi

సాధారణంగా అయితే బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ అంటే ఎలాంటి విశ్లేషణలు లేకుండా మనదే గెలుపు ఖాయమని అందరిలో నమ్మకం. అయితే కొంత కాలంగా బంగ్లాతో మ్యాచ్‌లు కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా... మ్యాచ్‌లో వేర్వేరు దశల్లో బంగ్లా అనూహ్యంగా చెలరేగి మన జట్టును ఇబ్బంది పెడుతోంది. పాక్‌తో మ్యాచ్‌ తరహాలో అభిమానులు కూడా అదనంగా కొన్నిసార్లు తమ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ సెమీస్‌ చేరడం దాదాపు ఖాయం కానుండగా, తమకంటే చిన్న జట్లపై రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్‌ సంచలనాన్ని ఆశిస్తోంది.

అడిలైడ్‌: గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరచి కొత్త ఉత్సాహంతో మరో పోరుకు భారత్‌ సన్నద్ధమైంది. సఫారీలను ఓడించి ఉంటే ఇప్పటికే మన సెమీస్‌ అవకాశాలపై మరింత స్పష్టత వచ్చేది. అయితే పెర్త్‌ పిచ్‌ అలాంటి అవ కాశం ఇవ్వలేదు. ఇప్పుడు గ్రూప్‌–2లో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్‌ను నేడు రోహిత్‌ సేన ఎదుర్కొంటోంది. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే భారత్‌ సహజంగానే ఫేవరెట్‌ కాగా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాల్సి ఉంటుంది. తమ స్థాయిని బట్టి చూస్తే టోర్నీలో ఇప్పటికే సంతృప్తికర ప్రదర్శన ఇచ్చిన బంగ్లా ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం.  

పంత్‌కు చాన్స్‌! 
వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు కోహ్లి, సూర్యకుమార్‌ రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆనందపరిచారు. రోహిత్‌ కూడా నెదర్లాండ్స్‌పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే టోర్నీలో ఇప్పటికీ తనేంటో కేఎల్‌ రాహుల్‌ నిరూపించుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను 4, 9, 9 చొప్పున పరుగులు చేశాడు. అయితే రాహుల్‌ విలువేంటో తమకు తెలుసని, జట్టులోంచి అతడిని తప్పించే అవకాశమే లేదని కోచ్‌ ద్రవిడ్‌ ఖరాఖండీగా చెప్పేశాడు కాబట్టి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవు. కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ గాయం విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక్‌కు ఆడించడంకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పంత్‌కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం కావచ్చు. బౌలింగ్‌లో ముగ్గురు రెగ్యులర్‌ పేసర్లకు తోడు స్పిన్నర్‌గా అశ్విన్‌నే కొనసాగిస్తారా చూడాలి. బంగ్లా లైనప్‌లో నలుగురు ఎడంచేతివాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్‌ సరైనోడు కావచ్చు.  

బౌలింగ్‌పైనే ఆశలు... 
లీగ్‌ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌లపై స్వల్ప తేడాలతో నెగ్గిన బంగ్లాదేశ్‌ జట్టుకు ఆ రెండు విజయాలు బౌలింగ్‌ కారణంగానే వచ్చాయి. ముఖ్యంగా పేసర్‌ తస్కీన్‌ అహ్మద్‌ జట్టు భారం మోస్తున్నాడు. ముస్తఫిజుర్‌ మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. హసన్‌ మహమూద్‌ కూడా కీలక పేసర్‌. ఆఫ్‌స్పిన్నర్‌ మొసద్దిక్‌ కూడా ప్రభావం చూపగలడు. అయితే వీరంతా కూడా బలమైన భారత బ్యాటింగ్‌ను నిలువరించడం అంత సులువు కాదు. బ్యాటింగ్‌లోనైతే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. నజ్ముల్, లిటన్, సర్కార్, అఫీఫ్‌లు ఏమాత్రం రాణిస్తారనేదానిపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి కెప్టెన్‌ షకీబ్‌ ఫామ్‌లో లేకపోవడమే ఇబ్బందిగా మారింది. పైగా ‘మేం వరల్డ్‌ కప్‌ గెలవడానికి రాలేదు’ అంటూ అతను వ్యాఖ్యానించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవే.  

పిచ్, వాతావరణం 
అడిలైడ్‌ ఓవల్‌ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు.

అప్పుడు ఏం జరిగిందంటే... 
టి20ల్లో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా, 10 భారత్‌ గెలిచింది. వరల్డ్‌కప్‌లో 2016లో ఆఖరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగు తేడాతో భారత్‌ నెగ్గింది. 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన బంగ్లా వరుసగా 2 ఫోర్లు కొట్టి సంబరాలు చేసుకోగా, తర్వాతి 3 బంతుల్లో భారత్‌ ఒక్క పరుగూ ఇవ్వకుండా 3 వికెట్లు తీయడాన్ని అభిమానులు మరచిపోలేరు.
చదవండి: కేఎల్‌ రాహుల్‌కు కోహ్లి పాఠాలు

మరిన్ని వార్తలు