ICC T20 Rankings: టాప్‌-10లోకి తొలిసారి .. ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి

15 Jun, 2022 16:42 IST|Sakshi

ఐసీసీ బుధవారం ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 164 పరుగులు చేసిన ఇషాన్‌ ఖాతాలో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో ఇషాన్‌ కిషన్‌ తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు.


23 ఏళ్ల ఇషాన్‌ ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి 689 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. మిగతా టీమిండియా బ్యాటర్లలో శ్రేయాస్‌ అయ్యర్‌ 17వ స్థానానికి పడిపోగా.. సిరీస్‌కు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ 14, రోహిత్‌ శర్మ 16, విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 21వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో తొలి ఆరు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. టి20 ప్రపంచ నెంబర్‌వన్‌ బ్యాటర్‌గా బాబర్‌ ఆజం(818 పాయింట్లు) నిలవగా.. పాకిస్తాన్‌కే చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌ 794 పాయింట్లతో రెండో స్థానంలో.. సౌతాఫ్రికా బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 772 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. టాప్‌-10 టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా చోటు దక్కించుకోలేదు. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌ ఏడు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలవగా.. చహల్‌ 26వ స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ నెంబర్‌ వన​ బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌(792 పాయింట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్‌ రషీద్‌(746 పాయింట్లు) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంసీ మూడో స్థానంలో ఉన్నాడు.ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్ మహ్మద్‌ నబీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌ స్టార్‌ షకీబుల్‌ హసన్‌ రెండు, మొయిన్‌ అలీ(ఇంగ్లండ్‌) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: ENG vs NZ 2nd Test: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్‌..

మరిన్ని వార్తలు