ICC Latest Test Rankings: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో!

27 Jul, 2022 17:00 IST|Sakshi
బాబర్‌ ఆజం(PC: PCB Twitter)

ICC Latest Test Rankings- Babar Azam: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తన చిరకాల కల నెరవేర్చుకునే క్రమంలో మరో ముందడుగు వేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో మొదటి టెస్టులో వరుసగా 119, 55 పరుగులు చేసిన బాబర్‌.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను వెనక్కి నెట్టి మూడో ర్యాంకు అందుకున్నాడు. 

ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌, టీమిండియాతో మ్యాచ్‌లలో దంచి కొట్టిన ఇంగ్లండ్‌ మాజీ సారథి జో రూట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 923 పాయింట్లతో మొదటి ర్యాంకు కాపాడుకున్నాడు. ఇక ఆసీస్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 885 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి రిషభ్‌ పంత్‌(801 పాయింట్లు) ఐదో స్థానంలో ఉండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 746 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

అది నా కల.. 
ఇటీవల బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. ‘‘అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌గా నిలవాలనేది ప్రతీ క్రికెటర్‌ కల. అందుకోసం మనం కఠిన శ్రమకోర్చి. ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటీ రెండు కాదు మూడు ఫార్మాట్లలోనూ టాప్‌లో ఉండాలి. 

ఒకవేళ మనం ఆ ఫీట్‌ సాధిస్తే.. దానిని నిలబెట్టుకునేందుకు మరింత ఫిట్‌గా ఉండేందుకు, మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’అని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు.

ఏకైక బ్యాటర్‌గా...
కాగా బాబర్‌ ఆజం ఇప్పటికే ఐసీసీ వన్డే, టీ20 బ్యాట్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ నేపథ్యంలోమూడు ఫార్మాట్లలోనూ టాప్‌-3లో ఉన్న ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే జోష్‌లో మూడు ఫార్మాట్లలో నంబర్‌ 1గా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్నాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే!
1.జోరూట్‌(ఇంగ్లండ్‌)
2.మార్నస్‌ లబుషేన్‌(ఆస్ట్రేలియా)
3.బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)
4.స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)
5.రిషభ్‌ పంత్‌(ఇండియా)
చదవండి: Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! సిరీస్‌ మొత్తానికి అతడు దూరం?
T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..

మరిన్ని వార్తలు