ICC RANKINGS: రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్‌

9 Jun, 2021 16:52 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(386 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అతను ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(385 పాయింట్లు)ను వెనక్కి నెట్టాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆశ్విన్‌ నాలుగో స్థానంలో, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఐదో స్థానంలో నిలిచారు.  

మరోవైపు టెస్ట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్‌-10లో కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్‌ కోహ్లీ 814 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో నిలిచారు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, జో రూట్‌ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లో, ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా 7 వికెట్లు పడగొట్టిన సౌథీ..838 రేటింగ్‌ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో రెండులో, 816 పాయింట్లతో న్యూజిలాండ్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ నాలుగో స్థానంలో నిలిచారు. 
చదవండి: జడేజాకు ఇంగ్లీష్‌ రాదు, అందుకే 'ఆ' సమస్య..

మరిన్ని వార్తలు