ICC Test Rankings: 10 వికెట్ల ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌-10లోకి..

25 Aug, 2021 17:23 IST|Sakshi

దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాళ్లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న అనంతరం విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో పాక్‌ సంచలన పేసర్‌ షాహిన్‌ అఫ్రిది, రెండో టెస్ట్‌ సెంచరీ హీరో ఫవాద్‌ ఆలమ్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తమతమ స్థానాలను మెరుగుపర్చుకుని కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకులను సాధించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో పది వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షాహిన్‌ అఫ్రిది ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి ఎగబాకగా, బాబర్‌ ఆజమ్‌ ఓ ప్లేస్‌ మెరుగుపర్చుకుని 7వ స్థానానికి, ఫవాద్‌ ఆలమ్‌ 34 స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ప్లేస్‌కు ఎగబాకారు.

బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్‌లు టాప్‌-10లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కోహ్లి(776), రోహిత్‌(773) ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా, పంత్‌(724) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(893) రెండో స్థానాన్ని, ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్ స్టీవ్ స్మిత్(891) మూడో ప్లేస్‌ను పదిలం చేసుకున్నారు. 

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ కేటగిరీలో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 848 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్‌ సౌథీ(824), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(816), కివీస్ పేసర్ నీల్ వాగ్నర్(810), ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ అండర్సన్(800) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: కోహ్లి, రూట్‌ కొట్టుకున్నంత పని చేశారట..!

మరిన్ని వార్తలు