ఐసీసీ భారత్‌కు సపోర్ట్‌ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్‌ అవార్డులు ఇవ్వాలంటూ పాక్‌ మాజీ ప్లేయర్‌ అక్కసు

4 Nov, 2022 11:15 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్‌ తమ సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. అయితే టీమిండియా విజయాన్ని  పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మాత్రం జీర్ణీంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం సాధించడంతో పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. 

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది  సంచలన వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ భారత్‌కు పరోక్షంగా మద్దతిస్తుంది అని అఫ్రిది ఆరోపించాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఎలాగైనా టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాలని ఐసీసీ భావిస్తోంది అని అతడు అక్కసు వెళ్లగక్కాడు.

"వర్షం కారణంగా మైదానం ఎంత చిత్తడిగా మారిందో మనం చూశం. బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా అంపైర్లుతో ఇదే విషయం చెప్పాడు. అయితే అంపైర్‌లతో పాటు ఐసీసీ కూడా భారత్‌కే ఫేవర్‌ చేసినట్లు నాకు అనిపిస్తోంది. భారత్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సెమీఫైనల్‌కు చేర్చాలని ఐసీసీ భావిస్తోంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో కూడా అంపైర్లు ఇదే తీరును కనబరిచారు. ఖచ్చితంగా వీరికి  ఉత్తమ అంపైర్ అవార్డులు లభిస్తాయి. 

విరామం తర్వాత మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందులో ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు సృష్టంగా తెలుస్తోంది.  ఈ సమయంలో ఐసీసీ, భారత్‌తో కలిసి బంగ్లాదేశ్‌ ఆడుతోంది. కాబట్టి కచ్చితంగా బంగ్లాదేశ్‌పై ఒత్తిడి ఉంటుంది. కానీ లిటన్‌ దాస్‌ మాత్రం అద్భుతంగా ఆడాడు. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యాక బంగ్లాదేశ్‌ మరో రెండు మూడు ఓవర్ల వరకు వికెట్లు కోల్పోకపోతే విజయం సాధిస్తుంది భావించాము. కానీ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పోరాటం మాత్రం అద్భుతం" అంటూ సమా టీవీతో ఆఫ్రిది పేర్కొన్నాడు. 


చదవండి: T20 WC 2022: టీమిండియాతో మ్యాచ్‌లో అదరగొట్టాడు.. లిటన్‌ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్‌


 

మరిన్ని వార్తలు