ICC ODI WC Super League: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్‌.. ఏడో స్థానంలో రోహిత్‌ సేన!

14 Jul, 2022 15:37 IST|Sakshi
బంగ్లా జట్టు సెల్ఫీ- టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

ICC ODI WC Super League Standings: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన బంగ్లాదేశ్‌ ఐసీసీ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. విండీస్‌తో రెండో వన్డేలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా.. మొత్తంగా 130 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీలో భాగంగా 2020-23గానూ ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ పందొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. 13 గెలిచింది. 

ఈ నేపథ్యంలో టాప్‌లోకి దూసుకువచ్చింది. కాగా వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌.. టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్‌ను మాత్రం ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. 

ఇక ఇంగ్లండ్‌ 18 మ్యాచ్‌లకు గానూ 12 గెలిచి 125 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ వరుసగా టాప్‌-5లో స్థానం దక్కించుకున్నాయి.

మరోవైపు తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన పరాజయాల సంఖ్య 14కు చేరింది. దీంతో ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం ఎనిమిది మాత్రమే గెలుపొందిన విండీస్‌ జట్టు ఆరోస్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌తో మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా ఏడో స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 

ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌ రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా పదకొండో స్థానానికి పడిపోయి పదమూడింటిలో కేవలం 4 విజయాలతో పదకొండో స్థానంలో నిలిచింది. కాగా ప్రపంచకప్‌-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించాలంటే ఆయా జట్లు టాప్‌-8లో నిలవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.

కాగా ఐసీసీ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే జట్టు గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధిస్తుంది. ఈసారి భారత్‌ ఈ ఈవెంట్‌ను హోస్ట్‌ చేస్తోంది. ఇక టాప్‌-8లో అడుగుపెట్టిన జట్లతో పాటు క్వాలిఫైయర్‌ రౌండ్‌లో విజయం సాధించిన రెండు జట్లు ప్రపంచకప్‌ రేసులో నిలుస్తాయి. 

చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్‌, వాతావరణం వివరాలు! రోహిత్‌ సేన గెలిచిందంటే!
Virat Kohli: అప్పుడు నేను, సచిన్‌, ద్రవిడ్‌! ఇప్పుడు కోహ్లి వంతు.. ఇక ముందు కూడా!

మరిన్ని వార్తలు