World Cup 2022- Ind W Vs Nz W: న్యూజిలాండ్‌తో భారత్‌ పోరు.. వాళ్లదే పైచేయి.. అయితేనేం!

9 Mar, 2022 16:55 IST|Sakshi

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌తో గురువారం తలపడనుంది. సెడాన్‌ పార్కు వేదికగా జరిగే మ్యాచ్‌లో వైట్‌ ఫెర్న్స్‌తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేల్లో ఎన్నిసార్లు పోటీపడ్డాయి? ప్రపంచకప్‌ చరిత్రలో ఎవరిది పైచేయి అన్న వివరాలు పరిశీలిద్దాం.

వాళ్లే ముందున్నారు!
అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్‌ ఫెర్న్స్‌ 32 విజయాలు సాధించగా... భారత్‌ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

వరల్డ్‌కప్‌లో ముఖాముఖి రికార్డు
ప్రపంచకప్‌ చరిత్రలోనూ భారత్‌పై న్యూజిలాండ్‌ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్‌ ఫెర్న్స్‌ జయకేతనం ఎగురవేయగా.. భారత్‌ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

మిథాలీ సూపర్‌ రికార్డు
భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇరు జట్ల బ్యాటర్లతో పోలిస్తే ఆమే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఈ వెటరన్‌ బ్యాటర్‌ 273 పరుగులు సాధించారు. ఇక ప్రపంచకప్‌ చరిత్రలోనూ ఇరు జట్లు పోటీ పడినపుడు మిథాలీ మాత్రమే సెంచరీ సాధించారు. 2017 వరల్డ్‌కప్‌లో మిథాలీ 109 పరుగులు చేశారు.

అంకెల్లో వెనుకబడ్డా.. ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన
ప్రపంచకప్‌-2017లో న్యూజిలాండ్‌- భారత్‌ 2017లో చివరిసారిగా మెగా ఈవెంట్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో వైట్‌ ఫెర్న్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 109 పరుగులు సాధించిన కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నారు.

కాగా ప్రస్తుత టోర్నీలో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారీ విజయంతో బోణీ కొట్టింది. 107 పరుగుల తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్‌ సైతం బంగ్లాదేశ్‌ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది జోష్‌ మీద ఉంది. ఈ క్రమంలో మార్చి 10 నాటి పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

చదవండి: ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్‌ 1

మరిన్ని వార్తలు