World Cup 2022: దంచికొట్టిన డానియెల్‌.. పాక్‌ను చిత్తు చేసి.. టాప్‌-4లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్‌

24 Mar, 2022 12:59 IST|Sakshi

ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022లో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా గురువారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్‌ను చిత్తు చేసి టాప్‌-4లోకి చేరి సెమీస్‌ అవకాశాలు మరింత మెరుగుపరుచుకుంది. కాగా పాకిస్తాన్‌ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌​ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆదిలోనే ఓపెనర్‌ నహీదా ఖాన్‌ అవుట్‌ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మరూఫ్‌ 9 పరుగులకే పెవిలియన్‌ చేరింది. పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ అమీన్‌ 32 టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 105 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది.

ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు స్టార్‌ ఓపెనర్‌ టామీ బీమౌంట్‌ 2 పరుగులకే నిష్క్రమించడం షాకిచ్చింది. అయితే మరో ఓపెనర్‌ డానియెల్‌ వ్యాట్‌ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో ఎండ్‌లో కెప్టెన్‌ హీథర్‌నైట్‌ సహకారం అందించడంతో 76 పరుగుల(68 బంతుల్లో- 11 ఫోర్ల సాయం)తో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌కు సునాయాస విజయం అందించింది.

వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌తో 19.2 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్‌ నష్టపోయి ఇంగ్లండ్‌ పాక్‌పై గెలుపొందింది. డానియెల్‌ వ్యాట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. 

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022
ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌ స్కోర్లు:
పాకిస్తాన్‌- 105 (41.3 ఓవర్లు)
ఇంగ్లండ్‌- 107/1 (19.2 ఓవర్లు)

A post shared by ICC (@icc)

చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ టాప్‌లో బంగ్లాదేశ్‌! టీమిండియా ఎక్కడ?

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు