ICC Women's World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా

3 Apr, 2022 13:38 IST|Sakshi

ICC Women's World Cup 2022 Winner Australia: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ను 71 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగని మెగ్‌ లానింగ్‌ బృందం అజేయ రికార్డును కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

అలిస్సా హేలీ విధ్వంసం
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఓపెనర్లు రాచెల్‌ హేన్స్‌(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) ఘనమైన ఆరంభం అందించారు. 

A post shared by ICC (@icc)

స్టార్‌ బ్యాటర్‌ బెత్‌మూనీ సైతం అర్ధ సెంచరీ(47 బంతుల్లోనే 62 పరుగులు) సాధించింది. ఇక హేలీ అవుటైన తర్వాత ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. హేలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది.

A post shared by ICC (@icc)

ఆదిలోనే గట్టి షాక్‌.. అయినా ఆమె ఒక్కతే
భారీ లక్ష్యంతో బరిలోని దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్‌ బౌలర్‌ మేగన్‌ షట్‌ ఆరంభంలోనే గట్టిషాకిచ్చింది. ఓపెనర్లు టామీ బీమౌంట్‌(27), డానియెల్‌ వ్యాట్‌(4) వికెట్లు కూల్చి మానసికంగా వారిని దెబ్బకొట్టింది. 

A post shared by ICC (@icc)

అయితే వరుసగా వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ నటాలీ సీవర్‌ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె 121 బంతులు ఎదుర్కొని 148 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అయితే, మరో ఎండ్‌ నుంచి సహకారం అందకపోవడంతో నటాలీ ఒంటరి పోరాటం వృథా అయింది.  43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.

దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఆసీస్‌కు టైటిల్‌ అందించడంలో కీలక పాత్ర పోషించిన అలిస్సా హేలీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

A post shared by ICC (@icc)

ఐసీసీ మహిళా ప్రపంచకప్‌-2022 ఫైనల్‌ విజేత ఆస్ట్రేలియా
ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా స్కోర్లు
ఆసీస్‌- 356/5 (50)
ఇంగ్లండ్‌- 285 (43.4)

మరిన్ని వార్తలు