World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. ఏడింటికి ఏడు గెలిచి.. అజేయ రికార్డుతో

25 Mar, 2022 12:29 IST|Sakshi

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్‌లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్‌టన్‌ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది.

తద్వారా ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో మెగ్‌ లానింగ్‌ బృందం నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్‌ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది.

టాస్‌ గెలిచి
బంగ్లాదేశ్‌ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్‌ షర్మిన్‌ అక్తర్‌(24), లతా మొండల్‌(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 

ఆదిలో తడబాటు.. అయితే..
లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అలీసా హేలీ, రేచల్‌ హేన్స్‌ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్‌ తగిలింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెత్‌ మూనీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్‌ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్‌ మూనీని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. 

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022
ఆస్ట్రేలియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ స్కోర్లు:
బంగ్లాదేశ్‌- 135/6 (43)
ఆస్ట్రేలియా 136/5 (32.1)

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

>
మరిన్ని వార్తలు