World Cup 2022: ఎదురులేని ఆసీస్‌.. కెప్టెన్‌ 15వ సెంచరీ.. అద్భుత విజయం

22 Mar, 2022 13:50 IST|Sakshi

Women's World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌ చేరిన మెగ్‌ లానింగ్‌ బృందం తాజాగా మరో విజయం నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో వెల్లింగ్టన్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆరూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుపుకొంది.

A post shared by ICC (@icc)

బౌలింగ్‌ ఎంచుకుని
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లీ(36), వొల్వార్ట్‌(90) శుభారంభం అందించారు. కెప్టెన్‌ సునే లాస్‌ 52 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా జట్టు 271 పరుగులు చేసింది.

A post shared by ICC (@icc)

మొదట తడబడినా..
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రేచల్‌ హేన్స్‌(17), అలీసా హేలీ(5) తక్కువ స్కోర్లకే అవుట్‌ అయ్యారు. ఈ క్రమంలో మెగ్‌ లానింగ్‌ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును ముందుకు నడిపింది. లానింగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ 45.2 ఓవర్లలో 5 వికెట్లు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన లానింగ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. కాగా ఆమెకు వన్డేల్లో ఇది 15వ సెంచరీ కావడం విశేషం.

A post shared by ICC (@icc)

>
మరిన్ని వార్తలు