‘ప్లేఆఫ్స్‌కు చేరకపోతే నేను ఫెయిలైనట్లే’

20 Sep, 2020 15:53 IST|Sakshi

దుబాయ్‌: గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని యువ ఢిల్లీ ఆకట్టుకుని నాకౌట్‌ రేసులో నిలిచింది. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన సెకండ్‌ క్వాలిఫయర్‌లో ఓటమి పాలు కావడంతో ఫైనల్‌కు చేరాలన్న ఆశలకు గండిపడింది. ఈసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరతామనే ధీమాలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్‌. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ యాజమాని పార్త్‌ జిందాల్‌ మాట్లాడుతూ..  గతేడాది తరహాలోనే తాము ఈసారి కూడా ప్లేఆఫ్‌ రేసులో కచ్చితంగా ఉంటామంటున్నాడు. తమ జట్టు ప్లేఆఫ్‌కు చేరే అన్ని అర్హతలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి: నా సక్సెస్‌ వెనుక కారణం అదే : రాయుడు)

ప్రస్తుతం తాము ప్లేఆఫ్స్‌పై దృష్టి పెట్టామన్నాడు. ప్రతీ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ ముందుకు సాగుతామన్నాడు. ఈ విషయంపై హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌తో ఎక్కువగా చర్చిస్తూ తుది జట్టు కూర్పును పక్కాగా ఉండేలా చూసుకుంటున్నామని జిందాల్‌ తెలిపాడు. ‘ ఈ సీజన్‌ ఐపీఎల్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాం. మూడు వారాల నుంచి పాంటింగ్‌తో పదేపదే సమావేశమవుతూ టార్గెట్‌ల గురించి చర్చిస్తున్నాం. ప్రస్తుతానికి మా గోల్‌ ప్లేఆఫ్స్‌. ఒకవేళ ఈసారి ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోతే నేను యాజమానిగానే కాకుండా చైర్మన్‌గా కూడా ఫెయిలైనట్లే. ఈరోజు(ఆదివారం) కింగ్స్‌ పంజాబ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఢిల్లీ జట్టులో అటు మెరుగైన యువ క్రికెటర్లు, ఇటు సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్.. శిఖర్ ధావన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవు లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, కగిసో రబడా, కీమో పాల్‌, మోహిత్‌ శర్మ, క్రిస్‌ వోక్స్‌లు ఉన్నారు.(చదవండి: ముంబైపై విజయంతో ధోని కొత్త చరిత్ర)

మరిన్ని వార్తలు