T20 WC 2022: వర్షంతో మ్యాచ్‌ రద్దయినా టీమిండియాకే మేలు

5 Nov, 2022 11:34 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో ఆదివారం గ్రూప్‌-2లో అన్ని జట్లు తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ముందుగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు పోటీ పడనున్నాయి. ఇక టోర్నీలో చివరి లీగ్‌ మ్యాచ్‌ టీమిండియా, జింబాబ్వే మధ్య జరుగుతుంది. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియా మ్యాచ్‌ ఆడే సమయానికి ఎవరు సెమీస్‌ చేరుతున్నారనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది.

ఎందుకంటే సెమీస్‌ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లు తమ మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాయి. సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌పై గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.. పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌పై గెలిస్తే టీమిండియా ఫలితం వరకు ఆగాల్సిందే. అటు సౌతాఫ్రికా కూడా గ్రూప్‌ టాపర్‌గా వెళుతుందా లేక రెండో స్థానమా అనేది కూడా టీమిండియా, జింబాబ్వే మ్యాచ్‌ తర్వాతే స్పష్టత రానుంది.

దీన్నిబట్టి టీమిండియా, జింబాబ్వే మ్యాచ్‌ పూర్తయ్యే వరకు సెమీస్‌ రేసులో ఎవరుంటారనేది ఫ్రశ్నార్థకమే. మరి ఒకవేళ టీమిండియా, జింబాబ్వే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి రద్దు అయితే అప్పుడు ఏం జరుగుతుందని సగటు అభిమాని ప్రశ్నలు వేస్తున్నారు. వర్షం పడి మ్యాచ్‌ రద్దయితే ఒక రకంగా టీమిండియాకే మేలు జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే 8 పాయింట్లతో ఎవరితో సంబంధం లేకుండా గ్రూప్‌-2 టాపర్‌గా నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.

అలా కాకుండా వర్షం కారణంగా జింబాబ్వేతో మ్యాచ్‌ ఒక్క బంతి  పడకుండా రద్దైతే టీమిండియా ఖాతాలో ఒక పాయింట్‌ వచ్చి చేరుతుంది. అప్పుడు కూడా టీమిండియా ఏడు పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌పై నెగ్గినప్పటికి ఆరు పాయింట్లే ఉంటాయి కాబట్టి ఆ జట్టు నిష్క్రమించక తప్పదు. 

ఒకవేళ సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాకిస్తే అప్పుడు ప్రొటిస్‌ జట్టు ఐదు పాయింట్లు.. అదే సమయంలో పాక్‌ బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఆరు పాయింట్లతో సెమీస్‌ చేరుతుంది. అయితే బంగ్లాదేశ్‌ గెలిస్తే మాత్రం.. టీమిండియా, బం‍గ్లా సెమీస్‌కు.. పాక్‌, సౌతాఫ్రికాలు ఇంటిబాట పట్టనున్నాయి.

ఒకవేళ జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతే మాత్రం దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ విజేత సెమీస్‌లో అడుగుపెడుతుంది. కాగా లీగ్‌ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే రిజర్వ్‌ డే ఆప్షన్‌ లేదు. కేవలం సెమీఫైనల్స్‌, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్‌ డే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలా వర్షంతో మ్యాచ్‌ రద్దయినా కూడా టీమిండియాకు మేలు జరగనుందనే చెప్పొచ్చు.

చదవండి: డిఫెండింగ్‌ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్‌ ఓడితేనే

పాక్‌కు మరోసారి టీమిండియానే దిక్కు

మరిన్ని వార్తలు