US Open 2022 Serena Williams: ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను' అంటూ భావోద్వేగం

3 Sep, 2022 14:56 IST|Sakshi

అమెరికన్‌ మహిళ టెన్నిస్‌ స్టార్‌.. నల్లకలువ సెరెనా విలియమ్స్‌ పోరాటం ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టామ్లానోవిక్ చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలన్న ఆమె కల తీరకుండానే కెరీర్‌ ముగించింది. కాగా యూఎస్‌ ఓపెన్‌ తర్వాత ఆటకు దూరం కానున్నట్లు సెరెనా ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా మ్యాచ్‌ అనంతరం ఇంటర్య్వూలో మాట్లాడిన సెరెనా విలియమ్స్‌ కన్నీటి పర్యంతమైంది. టెన్నిస్‌లో నా జీవిత ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగింది. కెరీర్‌ చివరి వరకు తనను ప్రోత్సహించిన అభిమానులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అభిమానుల వల్లే ఇంత దూరం రాగలిగాను. ఇక చిన్నప్పుడే టెన్నిస్‌పై మక్కువ పెంచుకోవడంలో నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఆటలోకి వచ్చిన తర్వాత అక్క వీనస్ విలియమ్స్ అండగా నిలిచింది. చెప్పాలంటే వీనస్ లేకపోతే.. సెరెనా అనే వ్యక్తి టెన్నిస్‌లో ఉండేది కాదు.. థాంక్యు అక్క.. నీ సపోర్ట్‌ ఎన్నటికి మరువనది.. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. నా కళ్ల నుంచి వచ్చి కన్నీళ్లు కావు ఆనందబాష్పాలు'' అంటూ భావోద్వేగంతో ముగించింది.

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ‘రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తారా?’ అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు.. కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. కాగా తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్‌ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఏడుసార్లు వింబుల్డన్‌.. మరో ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.

ఈ తరంలో మహిళల టెన్నిస్‌ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది.2017లో ప్రెగ్నెంట్‌ ఉ‍న్న సమయంలోనే సెరెనా చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గింది.అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది.

చదవండి: అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ!

మరిన్ని వార్తలు