ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన టీమిండియా ఓపెనర్‌

17 Aug, 2021 17:27 IST|Sakshi

లండన్: టీమిండియా స్టార్ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ ఇంగ్లండ్ ఆటగాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఒకరి వెంటపడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంటపడతాం అంటూ గట్టిగా హెచ్చరించాడు. కవ్వింపులకు తామేమీ భయపడమని, అందుకు ఘాటుగానే బదులిస్తామన్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు టీమిండియా పేసు గర్రం బుమ్రాను లక్ష్యంగా చేసుకోవడంపై రెండో టెస్ట్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే రాహుల్‌.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లపై ఇలా విరుచుకుపడటం ప్రస్తుతం సోషల్‌ మీడియలో చర్చనీయాంశంగా మారింది. 

కాగా, రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో జరిగింది. మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధిస్తున్న తరుణంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గొడవలకు దిగారు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్‌ పేసర్ అండర్సన్, టీమిండియా పేసర్‌ బుమ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఆదివారం టీమిండియా కెప్టెన్ కోహ్లి, అండర్సన్‌ల మధ్య అగ్గి రాజుకుంది. అనంతరం ఆట చివరి రోజు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బుమ్రాని టార్గెట్‌గా చేసుకుని రెచ్చగొట్టారు. మార్క్‌ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. ఈ పరిణామాలన్ని దృష్టిలో పెట్టుకుని లార్డ్స్‌ టెస్ట్‌ విజయానంతరం కేఎల్‌ రాహుల్ మాట్లాడుతూ.. 

'రెండు బలమైన జట్లు తలపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య యుద్ధాలే జరుగుతాయి. ఇలాంటప్పుడే ఆటగాళ్లలోని నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే, శ్రుతి మించిన కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. ఓ విధంగా ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి వారి వెంట పడతాం' అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా, లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన రాహుల్‌(248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌)కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
చదవండి: కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి

మరిన్ని వార్తలు