ILT20 2023: అలెక్స్‌ హేల్స్‌ ఊచకోత.. పరుగు తేడాతో సెంచరీ మిస్‌

22 Jan, 2023 18:05 IST|Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ (దుబాయ్‌) 2023లో ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌, డెసర్ట్‌ వైపర్స్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌ సెంచరీలు, సెంచరీ సాయంతో 356 పరుగులు (33 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసిన హేల్స్‌.. ఇవాళ (జనవరి 22) గల్ఫ్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి కేవలం పరుగు తేడాతో లీగ్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

హేల్స్‌ ఊచకోత ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రోహన్‌ ముస్తఫా (16 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ కొలిన్‌ మున్రో (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫోర్ట్‌ (15 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించారు. గల్ఫ్‌ జెయింట్స్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌, లియామ్‌ డాసన్‌, డేవిడ్‌ వీస్‌, క్రిస్‌ జోర్డాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్‌ టీమ్‌.. 3.3 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసి పోరాడుతుం‍ది. ఓపెనర్లు టామ్‌ బాంటన్‌ (3), జేమ్స్‌ విన్స్‌ (4) విఫలమయ్యారు. క్రిస్‌ లిన్‌ (22), రెహాన్‌ అహ్మద్‌ క్రీజ్‌లో ఉన్నారు. బాంటన్‌ వికెట్‌ టామ్‌ కర్రన్‌ పడగొట్టగా.. విన్స్‌ను కాట్రెల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

కాగా, తొట్ట తొలి ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో అలెక్స్‌ హేల్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లీగ్‌ తొలి మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 నాటౌట్‌ పరుగులు చేసిన హేల్స్‌.. ఆతర్వాత అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 64 పరుగులు, ఆ వెంటనే అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు.

తాజాగా గల్ఫ్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చెలరేగిన హేల్స్‌ పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ లీగ్‌లో తొలి సెంచరీ హేల్స్‌ పేరిటే నమోదై ఉంది. రెండో సెంచరీ ఇంగ్లండ్‌కే చెందిన టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (షార్జా వారియర్స్‌) బాదాడు. దుబాయ్‌ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్‌ (షార్జా వారియర్స్‌) 47 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 నాటౌట్‌ పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు