Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!

26 Jan, 2023 10:42 IST|Sakshi

అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో ముంబై ఎమిరేట్స్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలతో మెరిసిన పొలార్డ్‌ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్‌ వైపర్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్‌ క్యాచ్‌ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్‌ అనిపించింది. బౌండరీ లైన్‌ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్‌ అందుకున్న క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది.

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో సమిత్‌ పటేల్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని కొలిన్‌ మున్రో లాంగాన్‌ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్‌ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్‌ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను తీసుకొని వెనుకవైపుకు డైవ్‌ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్‌ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డెసర్ట్‌ వైపర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్‌ 67 నాటౌట్‌, పూరన్‌ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెసర్ట్‌ వైపర్స్‌.. అలెక్స్‌ హేల్స్‌(44 బంతుల్లో 62 నాటౌట్‌), షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌(29 బంతుల్లో 56 నాటౌట్‌) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్‌ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. 

చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'

'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'

మరిన్ని వార్తలు