PSL 2023: ఆట తక్కువ.. డ్రామాలెక్కువ

28 Feb, 2023 13:48 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఎనిమిదో సీజన్‌లో ఆట కన్నా డ్రామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్లను తమ మాటలతో కవ్వించడం.. లేదంటే గొడవపడడం ఇవే హైలైట్‌ అవుతున్నాయి. తాజాగా ఆదివారం పీఎస్‌ఎల్‌లో డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ముల్తాన్‌ సుల్తాన్స్‌, కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ సందర్భంగా కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌ ఇమాద్‌ వసీమ్‌ బూతులు మాట్లాడడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది.

విషయంలోకి వెళితే.. ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో అన్వర్‌ అలీ ఔటయ్యాడు. ఆ తర్వాత యంగ్‌ పేసర్‌ ఇషానుల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్‌ వేస్తున్న అకిఫ్‌ జావేద్‌తో ఇషానుల్లాను ఉద్దేశించి ఇమాద్‌ వసీమ్‌.. 'వాడికి ఫుల్‌ డెలివరీలు వేయకు.. బౌన్సర్లు మాత్రమే సంధించు'(“Don’t bowl full delivery to this ****only bowl bouncers”) అంటూ అసభ్యకరమైన పదం వాడాడు. ఇది స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఇది చూసిన క్రికెట్‌ అభిమానులు పీఎస్‌ఎల్‌లో ఆట తక్కువ.. డ్రామాలెక్కువ అనేలా తయారైందంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తయాబ్‌ తాహిర్‌ 65 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూ వేడ్‌ 46, జేమ్స్‌ విన్స్‌ 27 పరుగులు చేశారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ 101 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 29 పరుగులు చేశాడు. కరాచీ కింగ్స్‌ బౌలర్లలో షోయబ్‌ మాలిక్‌, తబ్రెయిజ్‌ షంసీలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమాద్‌ వసీమ్‌, అకిఫ్‌ జావెద్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: ముచ్చటగా మూడో టెస్టు.. ఎన్ని రోజుల్లో ముగుస్తుందో?

ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్‌' పనికిరాదు

మరిన్ని వార్తలు