ICC Rankings: దూసుకుపోతున్న పాక్‌ ప్లేయర్లు.. మూడో స్థానానికి ఎగబాకిన టీమిండియా పేసర్‌

6 Apr, 2022 16:08 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, షాహీన్‌ అఫ్రిదిలు తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల్లో (103, 106, 89 నాటౌట్‌) 298 పరుగులు చేసిన ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి (795 రేటింగ్‌ పాయింట్లు) చేరుకోగా, అదే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో ( 57, 114, 105) 276 పరుగులు చేసిన బాబర్‌ ఆజమ్‌.. భారీగా రేటింగ్‌ పాయింట్లు పెంచుకుని అగ్రస్థానంలో (891 పాయింట్లు) స్థిరపడ్డాడు. 


ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌ విభాగంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు (671 పాయింట్లు) చేరాడు. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (811), రోహిత్‌ శర్మ (791) తమ 2, 4 స్థానాలను పదిలం చేసుకోగా.. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (679) ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌, ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌, న్యూజిలాండ్‌ మ్యాట్‌ హెన్రీ, బంగ్లా స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. 

మరోవైపు టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగనప్పటికీ, టీమిండియా పేసర్‌ బుమ్రా (830) ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు, పాక్‌ స్పీడ్‌ గన్‌ షాహీన్‌ అఫ్రిది (827) నాలుగో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (850) రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 
చదవండి: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినీస్‌ ఎవరంటే..?
 

మరిన్ని వార్తలు