ఏం చేసినా జట్టు కోసమే : తాహిర్‌

15 Oct, 2020 18:37 IST|Sakshi

దుబాయ్‌ : దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌.. 2019 ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే తరపున 17 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. సీఎస్‌కే ఫైనల్‌ చేరడంలో తాహిర్‌ కీలకంగా వ్యవహరించాడు. కానీ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మాత్రం తాహిర్‌ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే సీఎస్‌కే ఆడిన మ్యాచ్‌ల్లో విరామం మధ్యలో తాహిర్‌ చెన్నై ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒక అంతర్జాతీయ బౌలర్‌ ఇలా డ్రింక్స్‌ మోయడం ఏంటని కామెంట్స్‌ చేశారు. తాజాగా నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై తాహిర్‌ బుధవారం ట్విటర్‌లో స్పందించాడు. డ్రింక్స్‌ మోయడంలో తప్పేమి ఉందని.. ఏం చేసినా జట్టుకోసమేనని పేర్కొన్నాడు. (చదవండి : అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్‌)

'నేను చెన్నై తరపున చాలాసార్లు మ్యాచ్‌లు ఆడినప్పుడు చాలా మంది నాకు డ్రింక్స్‌ అందించారు. ఇప్పుడు నాకన్నా బాగా ఆడుతున్న ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించడంలో తప్పేముంది. అయినా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. నేను ఆడుతున్నానా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు.. జట్టు గెలుపు నాకు ముఖ్యం కాదు.. ఏం చేసినా జట్టు కోసమే. ఒకవేళ నాకే అవకాశం వస్తే బెస్ట్‌ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. అవకాశాలు ఈసారి రాలేదు.. అందుకే డ్రింక్స్‌ అందించా. నా దృష్టిలో జట్టు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా.' అని చెప్పుకొచ్చాడు.


కాగా యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సీఎస్‌కే తన జట్టులో విదేశీ ఆటగాళ్లుగా షేన్‌ వాట్సన్‌, సామ్‌ కరన్‌, డు ప్లెసిస్‌, డ్వేన్‌ బ్రేవోలకు చోటు కల్పించడంతో తాహిర్‌కు అవకాశం రాలేదు. చెన్నై ఆడిన 8 మ్యాచ్‌ల్లో దాదాపు వీరితోనే బరిలోకి దిగింది. వాట్సన్‌, డుప్లెసిస్‌లు చెన్నైకి బ్యాటింగ్‌లో కీలకంగా మారగా.. బ్రావో, కరన్‌లు ఆల్‌రౌండర్లుగా సీఎస్‌కేలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ సీజన్‌లో వాట్సన్‌ రెండు అర్థసెంచరీలతో 281 పరుగులు, డుస్లెసిస్‌ 307 పరుగులతో మంచి ప్రదర్శన చేస్తుండగా.. బ్రావో 5 వికెట్లు తీయగా.. కరన్‌ ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై నుంచి అనుకున్నంత ప్రదర్శన రావడం లేదు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి చెన్నై ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోతుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. ఐదు ఓటమిలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. (చదవండి : ఇలాంటివి ధోనికి మాత్రమే సాధ్యం)

>
మరిన్ని వార్తలు