IND Vs PAK: బౌలౌట్‌లో ఇప్పటికీ ఓడించలేకపోతుంది.. పాపం పాకిస్తాన్‌

18 Sep, 2022 13:38 IST|Sakshi

2007లో తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి విజేతగా అవతరించిన టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకముందు ఇదే ప్రపంచకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు గ్రూఫ్‌ దశలోనే తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌ టై కావడం.. ఆ తర్వాత బౌలౌట్‌లో విజేతను తేల్చడం అభిమానులు ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు. టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య అప్పటివరకు ఎన్నో మ్యాచ్‌లు జరిగినప్పటికి.. బౌలౌట్‌ మ్యాచ్‌కు మాత్రం చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. 

విషయానికి వస్తే.. తాజాగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్‌ 2022లో అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. పాక్‌ మాత్రం మరో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు నెలరోజుల సమయం ఉన్నప్పటికి ఆసక్తి మాత్రం తారాస్థాయిలో ఉంది. 

ఈ నేపథ్యంలోనే టీమిండియా, పాకిస్తాన్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్లు 2007 బౌలౌట్‌ ఫ్లాష్‌బ్యాక్‌ పేరిట వీడియోనూ రూపొందించారు. ఈ వీడియోలో బౌలౌట్‌ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాలనుకున్నారు. కాగా భారత్‌ తరపున దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, శివరామకృష్ణన్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌లు పాల్గొనగా.. పాకిస్తాన్‌ నుంచి రమీజ్‌ రాజా, షోయబ్‌ అక్తర్‌, అమీర్‌ సోహైల్‌లు ఉన్నారు. 

బౌలౌట్‌లో తొలి బంతిని పాకిస్తాన్‌ నుంచి రమీజ్‌ రాజా వేయగా మిస్‌ అయింది. ఇక భారత్‌ నుంచి సునీల్‌ గావస్కర్‌ వేయగా వికెట్లకు తాకడంతో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో ప్రయత్నంలో పాకిస్తాన్‌ నుంచి అమీర్‌ సోహైల్‌  వేయగా.. ఈసారి కూడా గురి తప్పింది.. ఇక భారత్‌ నుంచి సొగసరి బ్యాటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ వేయగా.. గురి తప్పలేదు.. భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ముచ్చటగా మూడోసారి పాక్‌ తరపున షోయబ్‌ అక్తర్‌ వేయగా.. బంతి చాలా దూరం నుంచి వెళ్లింది. ఇక చివరగా భారత్‌ నుంచి శివరామకృష్ణన్‌ వేయగా.. నేరుగా బంతి వికెట్లను గిరాటేసింది. అంతే భారత్‌ 3-0తో బౌలౌట్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత పాక్‌ ఆటగాళ్లు.. భారత్‌ దిగ్గజాలకు అభినందనలు తెలిపారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం వినూత్నంగా స్పందించారు. ''2007లో పాకిస్తాన్‌ తొలిసారి బౌలౌట్‌లో ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు బౌలౌట్‌లో ఓడిపోతూనే వస్తుంది''.. ''ఎన్నిసార్లు బౌలౌట్లు నిర్వహించినా విజయం టీమిండియాదే..'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక అప్పటి బౌలౌట్‌ విషయానికి వస్తే.. 2007 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా రద్దు కావడంతో తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండయా  141 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో అప్పటి నిబంధనల ప్రకారం బౌల్ ఔట్‌కు వెళ్లా్ల్సి వచ్చింది. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో బౌలౌట్ నిర్వహించడం ఇది రెండోసారి మాత్రమే.పాకిస్థాన్ బౌలర్లు ముగ్గురూ ఒక్కసారి కూడా వికెట్లను పడగొట్టలేకపోగా.. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప ఒక్కో బాల్ వేసి వికెట్లను పడగొట్టారు. దీంతో 3-0 తేడాతో భారత్ గెలుపొందింది. ఆ తర్వాత బౌలౌట్ స్థానంలో సూపర్ ఓవర్ తీసుకొచ్చారు.

మరో విషయం ఏంటంటే.. బౌటౌట్ సమయంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాములుగానే వికెట్ల వెనుక నిలబడగా.. ధోనీ మాత్రం తెలివిగా.. బౌలర్ల ఏకాగ్రత చెదరకుండా ఉండటం కోసం వికెట్ల వెనుక మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఇది భారత్‌ విజయానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు