Ind vs Afg 2nd T20: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు! సంజూకు మొండిచేయే..

12 Jan, 2024 17:13 IST|Sakshi

India vs Afghanistan, 2nd T20I- Virat Kohli Re-Entry: అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి పునరాగమనం చేయనున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి మ్యాచ్‌కు దూరమైన ఈ రన్‌మెషీన్‌.. ఇండోర్‌లో రెండో టీ20కి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా ప్రకటించాడు.

కోహ్లి రాక.. వేటు ఎవరిపై?
మరి.. సీనియర్‌ ప్లేయర్‌, స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి తిరిగి టీ20 జట్టుతో చేరితే ఎవరిపై వేటు పడనుంది?! మొహాలీ వేదికగా అఫ్గన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్‌ శర్మతో పాటు శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

లెఫ్టాండర్‌ యశస్వి తిరిగి వస్తే
లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం రోహిత్‌కు జోడీగా యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తామని ద్రవిడ్‌ ముందే చెప్పినప్పటికీ.. గజ్జల్లో గాయం కారణంగా జైస్వాల్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో గిల్‌ను అదృష్టం వరించింది. 

మరోవైపు.. కోహ్లి గైర్హాజరీలో హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు వన్‌డౌన్‌లో ఆడే అవకాశం దక్కింది. సాధారణంగా తిలక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వస్తాడు. అయితే, తొలి టీ20లో మాత్రం అతడు టాపార్డర్‌కు ప్రమోట్‌ అయ్యాడు.

తిలక్‌ వర్మ సైతం..
ఇక ఈ మ్యాచ్‌లో గిల్‌తో సమన్వయలోపంతో రోహిత్‌ శర్మ రనౌట్‌(డక్‌) కాగా.. గిల్‌ 12 బంతుల్లోనే 23 పరుగులతో రాణించాడు. తిలక్‌ వర్మ సైతం 22 బంతుల్లో 26 రన్స్‌ సాధించాడు. ఇలా వీరిద్దరు తమ వంతు బాధ్యతను చక్కగానే పూర్తి చేశారు.

అయితే.. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20కి కోహ్లితో పాటు.. ఒకవేళ యశస్వి జైస్వాల్‌ కూడా అందుబాటులోకి వస్తే వీళ్లిద్దరిలో ఒకరిపై వేటు పడటం ఖాయం. ముఖ్యంగా వీరిద్దరి రాకతో గిల్‌కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే.. ఓపెనర్‌గా యశస్వి, వన్‌డౌన్‌లో కోహ్లి ఆడితే.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మిగిలిన ఏ స్థానంలో గిల్‌ బ్యాటింగ్‌ చేసే అవకాశం లేదు.

యశస్వి రాకుంటే
అలా కాకుండా.. గిల్‌ అదృష్టం బాగుండి యశస్వికి విశ్రాంతిని పొడిగిస్తే మాత్రం అతడికి లైన్‌ క్లియర్‌ అవుతుంది. అప్పుడు తిలక్‌ వర్మ ప్లేస్‌ గల్లంతవుతుంది. కోహ్లి కోసం తిలక్‌ తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

వాషీని వద్దనుకుంటే.. అప్పుడు సేఫ్‌
ఒకవేళ.. షార్ట్‌ బౌండరీలకు ప్రసిద్ధి పొందిన ఇండోర్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ డెప్త్‌ కోసం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాలనుకుంటే అప్పుడు వాషింగ్టన్‌ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంటుంది. తొలి టీ20 హీరో శివం దూబే(పేస్‌ ఆల్‌రౌండర్‌), అక్షర్‌ పటేల్‌(స్పిన్‌ ఆల్‌రౌండర్‌), రవి బిష్ణోయి(స్పిన్నర్‌), పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌లను ఆడించి .. వాషీని పక్కనపెడితే అప్పుడు తిలక్‌ కూడా సేఫ్‌గానే ఉంటాడు.

ఇదిలా ఉంటే.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అతడు 20 బంతుల్లోనే 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్‌ను కాదని సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి రెండో టీ20లో సంజూకు మరోసారి మొండిచేయే ఎదురయ్యే ఛాన్స్‌ ఉంది.

అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20(జనవరి 14)కి భారత జట్టు(అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌/శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శివం దూబే, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌.

చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్‌ పేసర్‌: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు

>
మరిన్ని వార్తలు