రోహిత్‌, పంత్‌లను అధిగమించిన యశస్వి జైస్వాల్‌

16 Jan, 2024 09:37 IST|Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ విషయంలో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌లను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 అనంతరం యశస్వి సాధించిన ఈ ఘనతకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి. టీ20ల్లో 23 ఏళ్లు దాటక ముందే అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నెలకొల్పాడు.

ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌, అప్‌ కమింగ్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్‌, పంత్‌, తిలక్‌ ముగ్గురూ 23 ఏళ్లు దాటకముందు రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేయగా.. యశస్వి ఏకంగా నాలుగు హాఫ్‌ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. 22 ఏళ్ల యశస్వి 16 టీ20ల్లోనే 163.83 స్ట్రయిక్‌రేట్‌తో 498 పరుగులు చేశాడు. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసిన యశస్వి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వితో పాటు శివమ్‌ దూబే (63 నాటౌట్‌) కూడా మెరుపులు మెరిపించడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. గుల్బదిన్‌ (57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.

అర్ష్‌దీప్‌ 3, అక్షర్‌, భిష్ణోయ్‌ తలో 2 వికెట్లు, శివమ్‌ దూబే ఓ వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో దూబే, జైస్వాల్‌ భారత్‌ ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది.

>
మరిన్ని వార్తలు