IND VS AUS 1st ODI: కేఎల్‌ రాహుల్‌ కేక.. ఐదో స్థానంలో అతన్ని మించినోడు లేడు..!

18 Mar, 2023 13:02 IST|Sakshi

ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (మార్చి 17) జరిగిన తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ (91 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) సాధించి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన కేఎల్‌ రాహుల్‌.. ఓ ఆసక్తికర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 నుంచి వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక హాఫ్‌ సెంచరీలు (8), అత్యధిక సగటు (60.50), అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ కలిగిన  ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.  

2020-23 మధ్యకాలంలో రాహుల్‌ ఐదో స్థానంలో బరిలోకి దిగి 8 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు సాధించగా.. శ్రీలంక ఆటగాడు చరిత్‌ అసలంక 7 హాఫ్‌ సెంచరీలు స్కోర్‌ చేశాడు. వీరి తర్వాత స్కాట్లాండ్‌ ప్లేయర్‌ జార్జ్‌ మున్సే 5, సఫారీ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 4, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 3 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశారు. గతకొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌.. నిన్న ఆసీస్‌తో జరిగిన వన్డేలో సత్తా చాటడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు. 

నిజానికి టెస్ట్‌ల్లో తప్పిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాహుల్‌ ప్రదర్శన మరీ అంత తీసికట్టుగా లేదు.  గత 9 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా హాఫ్‌ సెంచరీ చేయని రాహుల్‌.. వన్డే, టీ20ల్లో ఓ మ్యాచ్‌ తప్పించి మరో మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. అయితే మూడంకెల స్కోర్‌ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. 

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్‌ ఒక్క సారి కూడా సెంచరీ మార్కును క్రాస్‌ చేయలేదు. రాహుల్‌ తన చివరి సెంచరీని (టెస్ట్‌ల్లో) దక్షిణాఫ్రికాపై డిసెంబర్‌ 26, 2021న సాధించాడు.  వన్డేల్లో అయితే మార్చి 26, 2021న ఇంగ్లండ్‌పై తన చివరి శతకాన్ని నమోదు చేశాడు. టీ20ల విషయానికొస్తే.. జులై 3, 2018న ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీని అతనికి ఆఖరిది.  

కెరీర్‌లో ఇప్పటివరకు 47 టెస్ట్‌లు, 52 వన్డేలు, 72 టీ20లు ఆడిన కేఎల్‌ రాహుల్‌.. 7 టెస్ట్‌ శతకాలు, 5 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు సాధించాడు. రాహుల్‌ ఐపీఎల్‌లో సైతం 4 సెంచరీ చేశాడు. 

మరిన్ని వార్తలు