IND VS AUS 1st ODI: చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు

22 Sep, 2023 17:11 IST|Sakshi

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై భారత క్రికెట్‌ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో అయ్యర్‌ సునాయాసమైన క్యాచ్‌ను జారవిడచడంతో ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ ఆఖరి బంతికి డేవిడ్‌ వార్నర్‌ అందించిన లడ్డూ లాంటి క్యాచ్‌ను అయ్యర్‌ నేలపాలు చేశాడు.

శార్దూల్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీని డ్రైవ్‌ చేయబోయిన వార్నర్‌ బంతిని గాల్లోకి లేపాడు. ఆ సమయంలో మిడ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అయ్యర్‌ చేతుల్లోకి క్యాచ్‌ వెళ్లింది. అయితే దాన్ని ఒడిసిపట్టుకోవడంతో అయ్యర్‌ విఫలమయ్యాడు. గల్లీ క్రికెటర్లు సైతం సునాయాసంగా అందుకోగలిగిన క్యాచ్‌ను పట్టుకోవడంలో విఫలం కావడంతో అయ్యర్‌పై భారత క్రికెట్‌ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచినందుకు వారు అయ్యర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం అయ్యర్‌ క్యాచ్‌ డ్రాప్‌పై స్పందించాడు. ఇలా క్యాచ్‌లు జారవిడుచుకుంటూ పోతే, ఈసారి మనం వరల్డ్‌కప్‌ సాధించినట్లే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

కాగా, అయ్యర్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేసే సమయానికి 14 పరుగుల వద్ద ఉన్న వార్నర్‌, ఆతర్వాత గేర్‌ మార్చి​ బౌండరీలు, సిక్సర్లు బాది అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి భారత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆసీస్‌ 45 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.

మిచెల్‌ మార్ష్‌ (4), వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ (41), మార్నస్‌ లబూషేన్‌ (39), కెమరూన్‌ గ్రీన్‌ (31) ఔట్‌ కాగా.. ఇంగ్లిస్‌ (36), స్టోయినిస్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్‌, జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. గ్రీన్‌ రనౌటయ్యాడు.

మరిన్ని వార్తలు