Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్‌! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?!

21 Sep, 2022 13:42 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా(PC: Hardik Pandya)- పాక్‌ జట్టు(PC: PCB)

పాకిస్తాన్‌ నటి ట్వీట్‌కు కౌంటర్‌ ఇస్తూ టీమిండియా ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

India Vs Australia T20 Series- Pakistan Vs England T20 Series- T20 World Cup 2022: ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు(208) చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ.. భారత జట్టు ఫీల్డింగ్‌ తప్పిదాలు, బౌలర్ల వైఫల్యం కారణంగా రోహిత్‌ సేనకు పర్యాటక కంగారూ జట్టు చేతిలో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

పాండ్యా భావోద్వేగం
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా.. ‘‘మేము నేర్చుకుంటాం. మా ఆటను మెరుగుపరచుకుంటాం. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. 

అవును భయ్యా.. కనీసం మిగతా మ్యాచ్‌లైనా!
ఇందుకు స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘నీ అద్బుత ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది భయ్యా! బౌలర్లు రాణించి.. ఫీల్డింగ్‌ బాగా చేసి ఉంటే గెలిచేవాళ్లం. నువ్వన్నట్లు తప్పులు సరిదిద్దుకుని కనీసం మిగతా మ్యాచ్‌లలోనైనా గెలిస్తే బాగుంటుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.

ప్లీజ్‌.. పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోండి!
అయితే, పాకిస్తాన్‌ నటి, సామాజిక కార్యకర్తగా చెప్పుకొనే సెహర్‌ శిన్వారి అనే మహిళ మాత్రం పాండ్యాను, టీమిండియాను ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేసింది. ‘‘అక్టోబరు 23న పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా ఓడిపోండి ప్లీజ్‌.. అప్పుడు తప్పుల నుంచి మరిన్ని పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటూ భారత జట్టు ఆట తీరును అవమానించేలా కామెంట్‌ చేసింది.

చూద్దాం.. ఎవరు గెలుస్తారో?
మరి టీమిండియా ఫ్యాన్స్‌ ఊరుకుంటారా?! మంగళవారం మొదటి టీ20లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెహర్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ‘‘ముందు మీ గురించి మీరు చూసుకోండి. మీ జట్టు చేసిన పరుగులు 158. ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి. ఇప్పుడేమంటారు? 

ఆటలో గెలుపోటములు సహజమే! అయినా మీ జట్టు ఏదో పొడిచేసినట్టు మా వాళ్లను అంటారా? చూద్దాం.. అక్టోబరు 23న ఎవరిది పైచేయి అవుతుందో?!’’ అని సవాల్‌ విసురుతున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌- పాక్‌ అక్టోబరు 23న తలపడనున్న విషయం తెలిసిందే. 

చదవండి: Rohit Vs Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం!.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు