IND VS AUS 1st Test: డేవిడ్‌ వార్నర్‌పై పగపట్టిన అశ్విన్‌

11 Feb, 2023 21:12 IST|Sakshi

ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పగపట్టాడా..? అంటే ఔననే చెప్పాలి.  ఎందుకంటే, టెస్ట్‌ల్లో వార్నర్‌ను అత్యధికంగా ఔట్‌ చేసిన బౌలర్లలో యాష్‌ రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్‌ను అశ్విన్‌ టెస్ట్‌ల్లో 11 సార్లు ఔట్‌ చేశాడు. వార్నర్‌ను ఇంతలా ఇబ్బంది పెట్టిన బౌలర్లలో ఇంగ్లండ్‌ పేసర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌ (14 సార్లు), జిమ్మీ ఆండర్సన్‌ (10) ఒకటి, మూడు స్థానాల్లో ఉన్నారు.

అశ్విన్‌ అత్యధికంగా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లలో కూడా వార్నర్‌ తొలి స్థానంలో నిలిచాడు. అశ్విన్‌.. తన టెస్ట్‌ కెరీర్‌ మొత్తంలో వార్నర్‌ను అత్యధికంగా 11 సార్లు ఔట్‌ చేయగా.. అన్నే సార్లు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను (11 సార్లు) కూడా పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరి తర్వాత అశ్విన్‌  ధాటికి ఎక్కువ సార్లు బలైన బ్యాటర్లలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ సర్‌ అలిస్టర్‌ కుక్‌ ఉన్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కుక్‌ 9 సార్లు ఔటయ్యాడు.

టెస్ట్‌ల్లో ఓ భారత బౌలర్‌ అత్యధిక సార్లు ఒకే బ్యాటర్‌ను ఔట్‌ చేసిన రికార్డు క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ పేరిట ఉంది. కపిల్‌.. పాకిస్తాన్‌ ఆటగాడు ముదస్సర్‌ నాజర్‌ను అత్యధికంగా 12 సార్లు ఔట్‌ చేశాడు. ఈ జాబితాలో కపిల్‌ తర్వాత రెండు స్థానాల్లో అశ్వినే ఉన్నాడు. యాష్‌.. వార్నర్‌, స్టోక్స్‌లను టెస్ట్‌ల్లో 11 సార్లు ఔట్‌ చేశాడు. అశ్విన్‌కు ముందు కుక్‌కు అత్యధికంగా ఇబ్బంది పెట్టిన బౌలర్లలో టీమిండియా మాజీ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఉన్నాడు. ఇషాంత్‌.. కుక్‌ను టెస్ట్‌ల్లో 11 సార్లు పెవిలియన్‌కు సాగనంపాడు.

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ తన బాధితుల జాబితాలో స్టోక్స్‌కు సమానంగా వార్నర్‌కు ప్లేస్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో షమీ.. వార్నర్‌ను (1) క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన వార్నర్‌ను యాష్‌ ఎల్బీడబ్యూగా ఔట్‌ చేశాడు. కాగా, తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

మరిన్ని వార్తలు