Ind Vs Aus: అక్కడ ఆడటం ఈజీ కాదన్న షంసీ! చెత్త వాగకు అంటూ కౌంటర్‌

10 Feb, 2023 14:33 IST|Sakshi

India vs Australia, 1st Test: చెత్త మాటలు మాట్లాడితే సహించేది లేదంటూ నెటిజన్‌కు చురకలంటించాడు సౌతాఫ్రికా బౌలర్‌ తబ్రేజ్‌ షంసీ. ఏదైనా మాట్లాడేటపుడు కాస్త ముందూ వెనుక ఆలోచించాలని సూచించాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్‌ ప్రపంచమంతా టెస్టు క్రికెట్‌ ఫీవర్‌లో మునిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్‌ ఫైనలిస్టులను ఖరారు చేసే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్‌పైనే అందరి దృష్టి పడింది.

ఈ క్రమంలో పిచ్, ఆటగాళ్ల బలాబలాలు తదితర అంశాలపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తొలి టెస్టుకు వేదికైన నాగ్‌పూర్‌ పిచ్‌ను డాక్టర్డ్‌ పిచ్‌ అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. భారత జట్టు తమకు అనుకూలంగా(స్పిన్నర్లకు) పిచ్‌ తయారు చేయించుకుందని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా మాజీలు సీఏకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

షంసీ ఆసక్తికర ట్వీట్‌
ఇక గురువారం భారత్‌- ఆసీస్‌ తొలి టెస్టు ఆరంభం కాగా తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. టీమిండియా స్పిన్నింగ్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా ఐదు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు వికెట్లు తీసి కంగారూ జట్టు పతనాన్ని శాసించారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్‌ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఈ క్రమంలో.. సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంసీ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్‌ ఆడటం అంత సులువేమీ కాదు’’ అంటూ ఫన్నీ ఎమోజీని జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన ఓ నెటిజన్‌.. ‘‘నీకు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ కచ్చితంగా వస్తుంది.. కంగ్రాట్యులేషన్స్‌ బ్రో’’ అంటూ వెటకారం ప్రదర్శించాడు. అయితే, షంసీ సదరు ట్విటిజెన్‌కు ఘాటుగానే బదులిచ్చాడు.

చెత్త వాగకు..
‘‘నేను ఇండియాలో ఇండియాతో మ్యాచ్‌లు ఆడాను. బహుశా నువ్వు ఆ మ్యాచ్‌లు చూసి ఉండవు. నేను అక్కడ ఆడిన నా వ్యక్తిగత అనుభవం గురించి పంచుకున్నాను. నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెత్త వాగుతున్నావు. మన ఇద్దరి అభిప్రాయాల మధ్య చాలా తేడా ఉంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. థాంక్స్‌’’ అంటూ షంసీ కౌంటర్‌ ఇచ్చాడు. 

కాగా టీమిండియాతో పలు మ్యాచ్‌లు ఆడిన చైనామన్‌ స్పిన్నర్‌ షంసీ.. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2023 వేలం నేపథ్యంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో సదరు నెటిజన్‌ ఈ మేరకు కామెంట్‌ చేయగా.. షంసీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు.

చదవండి: IND VS AUS 1st Test: భారత క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు
IND vs AUS: ఆసీస్‌ స్పిన్నర్‌ దెబ్బకు సూర్యకు మైండ్‌ బ్లాంక్‌.. అయ్యో ఇలా జరిగిందే!!

మరిన్ని వార్తలు