BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. అక్షర్‌, సూర్యకుమార్‌లకు నో ఛాన్స్‌..!

7 Feb, 2023 10:33 IST|Sakshi

Wasim Jaffer Playing XI: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్‌ కోసం భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ తన ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో జాఫర్‌ రెండు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఊహించిన విధంగానే తొమ్మిది మందిని ఎంపిక చేసిన జాఫర్‌.. ఎన్నో అంచనాలను మోస్తున్న ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, టెస్ట్‌ అరంగేట్రంకు సిద్ధంగా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేశాడు.

అక్షర్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉందని కామెంట్‌ చేసిన జాఫర్‌.. సూర్యకుమార్‌ విషయాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్షర్‌కు బదులుగా తాను ఎంపిక చేసుకున్న కుల్దీప్‌ రిస్ట్‌ స్పిన్నర్‌గా వైవిధ్యాన్ని ప్రదర్శించగలడని జాఫర్‌ తన ఎంపికను సమర్ధించుకున్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌ విషయంలోనూ జాఫర్‌ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.

యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానం కోసం ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్‌ వికెట్‌కీపర్‌ అవసరమని భావించిన జాఫర్‌.. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌కు తన ఓటు వేశాడు. భరత్‌కు స్థానం కల్పించడంతో సూర్యకుమార్‌ను తప్పించి ఉంటాడని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

తొలి టెస్ట్‌ కోసం వసీం జాఫర్‌ ఎంచుకున్న తుది జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌

కాగా, గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్‌, బెంగళూరులో ఆసీస్‌ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్‌ గేమ్‌ను మొదలుపెట్టింది. సీఏ చేసిన 39 ఆలౌట్‌ వ్యాఖ్యలకు వసీం జాఫర్‌ తనదైన శైలీలో రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. 

భారత్‌-ఆసీస్‌ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై 
     
మరిన్ని వార్తలు