IND VS AUS 2nd ODI: భారత బ్యాటర్ల విశ్వరూపం.. చెత్త రికార్డు మూటగట్టుకున్న గ్రీన్‌

24 Sep, 2023 20:53 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఆసీస్‌ యువ పేసర్‌ కెమరూన్‌ గ్రీన్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్‌ చేసిన గ్రీన్‌ రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకుని, వన్డేల్లో ఆసీస్‌ తరఫున మూడో చెత్త బౌలింగ్‌ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. 

2006లో జోహనెస్‌బర్గ​్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్‌ మిక్‌ లెవిస్‌ సమర్పించుకున్న 113 పరుగులు వన్డేల్లో ఆసీస్‌ తరఫున అత్యంత చెత్త బౌలింగ్‌ ప్రదర్శన కాగా.. కొద్ది రోజుల కిందట అదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా కూడా 113 పరుగులు సమర్పించుకుని ఆసీస్‌ తరఫున రెండో చెత్త బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. 

తాజాగా గ్రీన్‌ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 103 పరుగులు సమర్పించుకుని వన్డేల్లో ఆసీస్‌ తరఫున మూడో చెత్త బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్‌ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు మొత్తం నలుగురు కాగా.. వారిలో మిక్‌ లెవిస్‌, ఆడమ్‌ జంపా, కెమరూన్‌ గ్రీన్‌, ఆండ్రూ టై (100) ఉన్నారు.

ఇవాల్టి మ్యాచ్‌లో గ్రీన్‌ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శనల్లో గ్రీన్‌ ఇవాల్టి మ్యాచ్‌ ప్రదర్శన (2/103) మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్‌ కంటే ముందు లంక బౌలర్‌ నువాన్‌ ప్రదీప్‌ (0/106), టిమ్‌ సౌథీ (0/105) ఉన్నారు. 

కాగా, రెండో వన్డేలో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్‌ కిషన్‌ (31) పర్వాలేదనిపించాడు.

రుతురాజ్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో కెమరూన్‌ గ్రీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 82/2గా ఉంది. లబూషేన్‌ (26), వార్నర్‌ (43) క్రీజ్‌లో ఉన్నారు.

33 ఓవర్లకు మ్యాచ్‌ కుదింపు..
వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఆసీస్‌ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు.

మరిన్ని వార్తలు