IND VS AUS 2nd ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

19 Mar, 2023 12:35 IST|Sakshi

విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకావాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. విశాఖలో ఈ తెల్లవారు జామున నుంచి ఎడితెరిపి లేకుండా కురిసిన వర్షం కొద్దిసేపటి క్రితం ఆగిపోయింది. వరుణుడు శాంతించడంతో పాటు మైదానం పరిసర ప్రాంతాల్లో ఎండ కూడా కాయడంతో ఢీలా పడిపోయిన అభిమానుల్లో జోష్‌ నెలకొంది.

స్టేడియం సిబ్బంది పిచ్‌పై నుంచి కవర్స్‌ పూర్తిగా తొలగించి, యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. మళ్లీ వర్షం పడితే తప్ప, మ్యాచ్‌ వంద శాతం సజావుగా సాగేందుకు ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మ్యాచ్‌ జరగాలని కోరుకున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే శుభవార్త. ఈ మ్యాచ్‌ కోసం చాలా రోజులుగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు వర్షం దెబ్బతో ఢీలా పడిపోయారు. అయితే, తాజా పరిస్ధితులను చూసి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

కాగా, సాయంత్రం సమయంలో వరుణుడు మరోసారి విజృంభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అలర్ట్‌ ఉన్నప్పటికీ.. అభిమానులు మాత్రం వరుణ దేవుడు కురుణిస్తాడని ఆశిస్తున్నారు. 3 వన్డేల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో నెగ్గిన భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు