IND VS AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్‌లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు

24 Sep, 2023 20:22 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్‌ వన్డే క్రికెట్‌లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. 

భారత​్‌ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్‌ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్‌ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్‌ (2387), ఇంగ్లండ్‌ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్‌ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్‌ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్‌పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. 

కాగా, ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్‌ (17), వార్నర్‌ (26) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు