IND VS AUS 2nd ODI: విరాట్‌, రోహిత్‌ల సరసన చేరిన శుభ్‌మన్‌ గిల్‌

24 Sep, 2023 17:30 IST|Sakshi

టీమిండియా యంగ్‌ డైనమైట్‌ శుభ్‌మన్‌ గిల్‌ వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిన గిల్‌ వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీని, ఈ ఏడాది ఐదో వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) ఈ ఏడాది ఏడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో గిల్‌ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, శిఖర్‌ ధవన్‌ల సరసన చేరాడు. పైన పేర్కొన్న వారంతా ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 5 అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన వారు.

తాజా సెంచరీతో గిల్‌ దిగ్గజాల సరసన చేరాడు. వీరిలో విరాట్‌ కోహ్లి అత్యధికంగా ఓ ఏడాది 5 అంతకంటే సెంచరీలను నాలుగు సార్లు (2012, 2017, 2018, 2019) చేయగా.. రోహిత్‌ శర్మ మూడు సార్లు (2017, 2018, 2019), సచిన్‌ టెండూల్కర్‌ రెండు సార్లు (1996, 1998), రాహుల్‌  ద్రవిడ్‌ (2019), గంగూలీ (2000), ధవన్‌ (2013), గిల్‌ (2023) తలో సారి ఈ ఘనతను సాధించారు. ఈ ఘనతతో పాటు గిల్‌ మరో రెండు రికార్డులను కూడా సాధించాడు.

25 ఏళ్ల లోపు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 5 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన  ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గిల్‌కు ముందు సచిన్‌ (1996), గ్రేమ్‌ స్మిత్‌ (2005), ఉపుల్‌ తరంగ (2006), విరాట్‌ కోహ్లి (2012) ఈ ఘనతను సాధించారు. వీరితో తరంగ అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఆరు సెంచరీలు సాధించిన ఆటగాడిగానూ గిల్‌ రికార్డుల్లోకెక్కాడు. గిల్‌ వన్డేల్లో ఆరు సెంచరీలు చేసేందుకు 35 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. శిఖర్‌ ధవన్‌ 46, రాహుల్‌ 53, కోహ్లి 61, గంభీర్‌ 68 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు.

వన్డే కెరీర్లో మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్‌.. ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో 1225 పరుగులు చేశాడు.     

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో గిల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫామ్‌ లేమితో సతమతమవుతున్న శ్రేయస్‌ ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని కెరీర్‌లో మూడో​ శతకాన్ని సాధించాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 306/4గా ఉంది. రాహుల్‌ (45), సూర్యకుమార్‌ యాదవ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు