Ind Vs Aus 2nd T20: పాక్‌ రికార్డును సమం చేసిన రోహిత్‌ సేన! ఇక విరాట్‌ వికెట్‌ విషయంలో..

24 Sep, 2022 11:02 IST|Sakshi

India Vs Australia T20 Series- 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. నాగ్‌పూర్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది మొహాలీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 46 పరుగులు- నాటౌట్‌)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పాకిస్తాన్‌తో సమంగా..
ఇక 2022లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఇది ఇరవయవ విజయం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ తర్వాత ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో జట్టుగా రోహిత్‌ సేన నిలిచింది. పాక్‌ పేరిట ఉన్న రికార్డు(2021లో 20 విజయాలు)ను సమం చేసింది. 

దీనితో పాటు నాగ్‌పూర్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేమిటంటే..

హిట్‌మ్యాన్‌ రెండు రికార్డులు!
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిలిచాడు. ఆసీస్‌తో రెండో మ్యాచ్‌లో 4 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. పొట్టి ఫార్మాట్‌లో 500 బౌండరీల మార్కును అందుకున్నాడు. ఇక 478 బౌండరీలతో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ రోహిత్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

అదే విధంగా అత్యధిక సిక్సర్లు(176) బాదిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్‌ శర్మ. 

విరాట్‌ వికెట్‌ విషయంలో..
నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి ఆసీస్‌ బౌలర్‌ ఆడం జంపాకు వికెట్‌ సమర్పించుకున్నాడు. కోహ్లి.. ఈ లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో అవుట్‌ కావడం ఇది ఎనిమిదోసారి.

తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ తర్వాత కోహ్లిని అత్యధిక సార్లు పెవిలియన్‌కు పంపిన రెండో బౌలర్‌గా జంపా నిలిచాడు. సౌథీ టీ20లలో రెండుసార్లు, వన్డేలో ఆరు సార్లు కోహ్లి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జంపా పొట్టి ఫార్మాట్‌లో మూడుసార్లు, వన్డేల్లో ఐదు సార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో రెండు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు జంపా.

చదవండి: Jasprit Bumrah-Aaron Finch: బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫిదా

మరిన్ని వార్తలు