Ind Vs Aus 2nd T20: ‘ఆరెంజ్‌ సిటీ’లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

22 Sep, 2022 11:08 IST|Sakshi
నాగ్‌పూర్‌లో విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ(PC: BCCI Twitter)

India Vs Australia T20 Series- 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా నాగ్‌పూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్డు నుంచి హోటల్‌కు చేరుకోగానే అక్కడి సిబ్బంది టీమిండియా క్రికెటర్ల మెడలో పూల మాలలు వేసి చప్పట్లతో ఆహ్వానం పలికారు.

మరోవైపు.. తమ అభిమాన ఆటగాళ్ల కోసం వేచి ఉన్న ఫ్యాన్స్‌ ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఇక ఆరెంజ్‌ సిటీలో టీమిండియా ఆటగాళ్లకు లభించిన ఈ గ్రాండ్‌ వెల్‌కమ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్‌ యజువేంద్ర చహల్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ముందుగా ఎంట్రీ ఇవ్వగా.. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు. కాగా శుక్రవారం(సెప్టెంబరు 23) భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరుగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌ ఇందుకు వేదిక కానుంది.

ఇక మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌ పర్యాటక ఆసీస్‌ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20 భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ రేసులో నిలుస్తుంది. టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది.

చదవండి: LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం
Pro Kabaddi League 2022: ప్రొ కబడ్డీ లీగ్‌ మొదటి దశ షెడ్యూల్‌ విడుదల! వేదికలు, ఇతర వివరాలు

మరిన్ని వార్తలు