IND VS AUS 3rd ODI: మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి వచ్చిన అనుకోని అతిథి.. తల గోక్కున రోహిత్‌

22 Mar, 2023 20:29 IST|Sakshi

చెన్నై వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా మధ్యలో ఓ అనుకోని అతిధి వచ్చి గ్రౌండ్‌ స్టాఫ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తుండగా 43వ ఓవర్‌లో ఓ శునకం మైదానంలో చొరబడి, గ్రౌండ్‌ సిబ్బందికి పట్టుకోండి చూద్దాం అన్న ఛాలెంజ్‌ విసిరింది. ఇద్దరు సిబ్బంది శునకాన్ని బయటకు తరమాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సిబ్బంది కింద కూడా పడ్డారు. ఈ మొత్తం తంతును చూస్తూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తల గోక్కుంటూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌ (7-1-37-2), అక్షర్‌ పటేల్‌ (8-0-57-2), హార్ధిక్‌ పాండ్యా (8-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్‌ టార్గెట్‌ను ఉంచింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్‌ చేశారు. ట్రవిస్‌ హెడ్‌ (33), మిచెల్‌ మార్ష్‌ (47), డేవిడ్‌ వార్నర్‌ (23), లబూషేన్‌ (28), అలెక్స్‌ క్యారీ (38), స్టోయినిస్‌ (25), సీన్‌ అబాట్‌ (26), అస్టన్‌ అగర్‌ (17), స్టార్క్‌ (10), జంపా (10 నాటౌట్‌) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. 

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 30 ఓవర్లు పూర్తియ్యే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (37), కేఎల్‌ రాహుల్‌ (32), అక్షర్‌ పటేల్‌ (2) ఔట్‌ కాగా.. కోహ్లి (49), హార్ధిక్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు